● ఆకట్టుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి శంకరశెట్టి రంగరామానుజయ్య కళావేదికపై గుంటూరు అభియన ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ నాటికను ప్రదర్శించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిత చరమాంకం వరకు వ్యక్తిత్వ విలువలను కాపాడుకున్న ఓ ఆదర్శ వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నాటికకు రచన స్నిగ్ద, దర్శకత్వం ఎస్.రవీంద్రారెడ్డి వ్యవహరించారు. అనంతరం చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారి ‘అ’సత్యం నాటికను ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదని, చెడుకు దోహదపడితే అది అసత్యమని, మంచి పనికి ఉపయోగపడితే అసత్యమైనా దానిని సత్యంగా భావించాలనే సందేశంతో నాటిక సాగింది. నాటికకు కథ మోదుగు శ్రీసుధ, దర్శకత్వం బాలాజీ నాయక్ వ్యవహరించారు. నాటికలోని పాత్రధారులు ఆ పాత్రలకు నటనతో జీవం పోశారు. అనంతరం నాటికల్లోని నటీనటులను, రచయిత, దర్శకత్వం వహించిన వారికి వైద్యులు శంకరశెట్టి కొండలరావు, డాక్టర్ పేట శ్రీకాంత్‌లు ప్రదర్శనా పారితోషకాన్ని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉగాది పురస్కార గ్రహీత, చిత్రకారులు, కవి కోన రమణారావును కళాంజలి తరఫున సత్కరించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు.


