పెద్దదోర్నాల: మండల పరిధిలోని సుందరయ్య కాలనీలో ఓ చెంచు గిరిజనుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మర్రిపాలెం గిరిజన గూడేనికి చెందిన పోలయ్య(35) సుందరయ్య కాలనీలోని బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి అక్కడే పడుకున్న పోలయ్య మంగళవారం ఉదయానికి మృతి చెంది ఉన్నాడు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, నలుగురు సంతానం. ఈ మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టనునన్నట్లు ఏఎస్సై పోల్‌రాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించనున్నారు.
ఒంగోలు టౌన్: నీరు, భూమి,చెట్టు సంరక్షణ కోసం రూపొందించిన వాల్టా చట్టం అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి.వీరభద్రాచారి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో యథేచ్ఛగా చెట్లు నరికివేత, భూగర్భ జలాల దుర్వినియోగం, చెరువులు కుంటల ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. వాల్టా చట్టం అమలు అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు అసలు పట్టించుకోవడంలేదన్నారు. ఒంగోలు నగరంలోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో 10 చెట్లను నరికివేసినా అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.


