డీజిల్‌ ఏడిపిస్తూ! | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ ఏడిపిస్తూ!

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

జిల్లాలో కొనసాగుతున్న సంక్షోభం 40 శాతం మూతపడిన బంకులు కొన్నింటిలో డీజిల్‌ లేకపోతే, మరికొన్నింటిలో పెట్రోలు లేదు ఉన్న వాటిల్లో కారుకు రూ.1000, ఆటోకు రూ.400–రూ.500, బైక్‌లకు రూ.200కు మాత్రమే ఆయిల్‌ ఒంగోలు నగరంలో ఆగిన ఆటోలు దాదాపు 2 వేలకు పైగానే... ఆటో చార్జీలు రూ.20 నుంచి రూ.30కు పెరిగిన వైనం..

డీజిల్‌ దొరక్క ఒంగోలు నగరంలో ఆటోవాలాలు,

కార్మికుల కష్టాలు

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో 40 శాతం పెట్రోలు బంకులు రెండో రోజు సోమవారం కూడా మూతపడ్డాయి. ఆయిల్‌ కంపెనీల నుంచి డీజిల్‌, పెట్రోలు సరఫరా లేకపోవటంతో బంకులు మూసేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న రెండు బంకులు మూసేశారు. ఉన్న పెట్రోలు బంకుల్లో కొన్నింటిలో డీజిల్‌ లేకపోతే మరికొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేదు. దీంతో వాహనదారులు ప్రతి పెట్రోలు బంకు వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఆయిల్‌ సప్‌లై ఉన్న బంకుల్లో కారుకు రూ.1000, ఆటోకు ఒక్కో బంకులో ఉన్న స్టాకును బట్టి ఒక్కో చోట ఒక్కో ఆటోకు రూ.400 నుంచి రూ.500 చొప్పున కొడుతున్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు రూ.200లకు మాత్రమే పడుతున్నారు. హైవేపైన అయితే సుదూర ప్రాంతాలకు భారీ లోడులతో వెళుతున్న లారీల పరిస్థితి దారుణంగా మారింది. రూ.1000 కంటే ఎక్కువ కొట్టకపోవటంతో ఎక్కడ ఆగిపోతాయోనని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరంలో దాదాపు 2 వేలకు పైగా ఆటోలు డీజిల్‌ కొరత ఉండటంతో పాటు క్యూలైన్లలో నిలబడలేక ఇళ్ల వద్దే ఆపుకున్నారు. గతంలో ఒంగోలు నగరంలో ఎక్కడ నుంచి ఎక్కడికై నా సింగిల్‌ రన్‌కు రూ.20 ప్రయాణికుల నుంచి వసూలు చేసేవారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆటోవాలాలు రూ.30 వసూలు చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమస్య రాకముందు ఒకరిని ఎక్కించుకొని ఆటోలు పోతూ ఉండేవి. అలాంటిది ప్రస్తుతం ఒక్కరు ఆగి ఉంటే ఒక్కరికి ఏమి వస్తాం రూ.50 ఇస్తావా, రూ.75 ఇస్తావా, లేకుండా కొంచెం దూరాభారం అయితే రూ.100 ఇస్తావా అని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో ప్రయాణికులు కాళ్లకు పని చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్‌గా ఆయిల్‌ పోయవద్దని, డబ్బాల్లో కూడా వద్దని కలెక్టర్‌ రాజాబాబు పలు బంకులను తనిఖీ చేసిన సందర్భంగా నిర్వాహకులను ఆదేశించారు.

పోలీస్‌ పహారా మధ్య

మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో పోలీసు పహారా మధ్య పెట్రోల్‌, డీజిల్‌ను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో 8 పెట్రోల్‌ బంకులు ఉండగా రెండు మూడు చోట్ల మాత్రమే పరిమితంగా పెట్రోల్‌, డీజిల్‌ పంపిణీ జరుగుతోంది. పోలీసులు పెట్రోల్‌ బంకుల్లో డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమితంగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ఇవ్వడంతో డ్రైవర్లు, కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల్లో వెయ్యికి పైగా ఆటోలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలందరూ ప్రతిరోజూ ఆటోల ద్వారానే మార్కాపురానికి వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు. డీజిల్‌ కొరత కారణంగా పలు చోట్ల ఆటోలను డ్రైవర్లు ఇళ్లకే పరిమితం చేసుకున్నారు. దీంతో పట్టణానికి వచ్చేందుకు కూడా అవస్థలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం ఏబీఎం స్కూల్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు డీజిల్‌ కోసం బారులు తీరాయి.

బ్లాక్‌లో అమ్మకాలు

సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం గ్రామంలో బ్లాక్‌ మార్కెట్‌లో డీజిల్‌ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డీజిల్‌ లీటరు రూ.96 ఉండగా ఇక్కడ మాత్రం బ్లాక్‌ మార్కెట్‌లో రూ.150 కు అమ్ముతున్నారని, దీంతో అంతరేటు పెట్టి డీజిల్‌ కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. అధిక ధరకు డీజిల్‌ కొనలేక ఇంటివద్దే ఆటోలు ఆపామని అంటున్నారు.

గ్రానైట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం

డీజిల్‌ కొరత గ్రానైట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చీమకుర్తి కేంద్రంగా దాదాపు 50కి పైగా గ్రానైట్‌ క్వారీలు, 60–70కి పైగా ఉన్న కంకర మిల్లులు, 600కు పైగా ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై డీజిల్‌ కొరత పెను భారంగా మారిందని ఆయా క్వారీలు, కంపెనీల యజమానులు వాపోతున్నారు. రోజుకు 1000 లీటర్లు కూడా దొరక్కపోవడంతో క్వారీలో రాయిని తీసే పనిని తగ్గించుకున్నారు. పైగా రిటెయిల్‌ అవసరాలకు లీటరు రూ.98 ఉంటే ఇండస్ట్రీ అవసరాలకు ఉపయోగించే డీజిల్‌పై అదనంగా రూ.55 పెంచి రూ.152 లెక్కన లీటరుకు వసూలు చేస్తున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలులో పోలీసు శాఖ నడుపుతున్న పెట్రోలు బంకు వద్ద బారులుతీరిన వాహనాలు

Advertisement
 
Advertisement
Advertisement