ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా..! | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా..!

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

వైఎస్సార్‌ సీపీ మహిళలను తిట్టిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయరా..! మేం ఫిర్యాదు చేస్తే మాపైనే కేసులు కడతారా..! డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, ఇన్‌చార్జిలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ

మార్కాపురం: మహిళలను కించపరుస్తూ తన మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ఫిర్యాదు చేస్తే ఇంత వరకూ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా కేసు నమోదు చేయాలని కోరుతూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్‌ సోమవారం మార్కాపురం డీఎస్పీ డాక్టర్‌ నాగరాజుకు వినతిపత్రం ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ మహిళలను కించపరుస్తూ టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా తమ పార్టీ వారిపై ఎదురు కేసులు నమోదు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు పెట్రోల్‌, డీజిల్‌ బంకుల వద్ద కాపలా కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పాలనతోపాటు ఎర్రిబుక్కు పాలన సాగుతుందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ విమర్శించారు. మద్యం ఫుల్‌గా దొరుకుతుండగా పెట్రోల్‌, డీజిల్‌ నిల్‌ అని, తప్పుచేసిన వారిపై కేసులు లేకపోగా, తప్పు చేయనివారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ మహిళలను కించపరిచేలా వార్త ప్రచురించిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల తల్లులు, భార్యలు, చెల్లెళ్లపై దుర్మార్గంగా ఆయన తన ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాస్తే తాము ఫిర్యాదు చేసినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని అన్నారు. ఇలాంటివాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా తమ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకపోతే పోలీసు స్టేషన్ల వద్ద ధర్నా చేస్తామని చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

వారిపై కేసులు నమోదు చేయండి: అన్నా రాంబాబు

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణతోపాటు వైఎస్సార్‌ సీపీ మహిళలను కించపరిచిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈనెల 9న తాము పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గమైన వార్తలు రాయడం మంచిది కాదన్నారు. సమాజంలో రుగ్మతలను వెలికితీయాల్సిన బాధ్యతను విస్మరించి మహిళలను కించపరిచేలా రాయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే విలువలు పోతాయన్నారు. జర్నలిజానికి విలువలు అవసరమని అన్నారు. దిగజారి వార్తలు రాయవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, తర్లుపాడు మండల కన్వీనరు మురారి వెంకటేశ్వర్లు, కనిగిరి మాజీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫూర్‌, జెడ్పీటీసీ ఎం కస్తూరిరెడ్డి, అధికార ప్రతినిధి జీ ఆదినారాయణ, ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు కె వెంకటరత్నం, జిల్లా వాలంటీర్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కే నాయబ్‌రసూల్‌, డాక్టర్స్‌ వింగ్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎం శ్రీహరిరెడ్డి, రమేష్‌రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆంజనేయరెడ్డి, యర్రగొండపాలెం మండల ప్రెసిడెంట్‌ వై ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ ప్రతినిధి నూర్‌ అహ్మద్‌, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement