మే 9న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

మే 9న జాతీయ లోక్‌ అదాలత్‌

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

మే 9న జాతీయ లోక్‌ అదాలత్‌ జీతాలు ఇవ్వండి మహాప్రభో... ఆరు కేంద్రాల్లో నీట్‌ పరీక్ష

ఒంగోలు: జాతీయ లోక్‌ అదాలత్‌ మే 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ టి.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల సివిల్‌ కేసులు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్‌ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, మోటారు వాహన ప్రమాద సంబంధ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రీలిటిగేషన్‌ స్థాయిలో కూడా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీపడిన అన్ని సివిల్‌ కేసుల్లో కోర్టు ఫీజును తిరిగి కక్షిదారులకు అందిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ టి.రాజ్యలక్ష్మి తెలిపారు.

● కలెక్టరేట్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ఒంగోలు టౌన్‌: నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, కార్మికులను ఆప్కాస్‌లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ...గత పదేళ్లుగా కోవిడ్‌ కార్మికులు పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేకపోతే కోవిడ్‌ కార్మికులను ఆప్కాస్‌లో కలపాలని కోరారు. కార్మికులకు పీఎఫ్‌, ఈహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలని, మహిళా కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు సెలవులు అడిగితే ఇష్టముంటే పనిచేయండి లేకపోతే వెళ్లిపోండని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టి.మహేష్‌, బి.దివ్య, వి.భారతి, జేమ్స్‌, వంశీ, మోహన్‌ రావు, ఆర్‌.రాములు ,రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. వచ్చేనెల 3వ తేదీ జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంపై సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారితో కలిసి అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఒంగోలులో కేంద్రియ విద్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, నవోదయ విద్యాలయం, డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, పీవీఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 1728 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ఫణికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంభూపాల్‌ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, పరీక్షల కోఆర్డినేటర్‌ రాజేష్‌, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఈ కేంద్రాలకు నోడల్‌ అధికారులుగా ఉన్న తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement