‘మీ కోసం’కు 263 వినతులు | - | Sakshi
Sakshi News home page

‘మీ కోసం’కు 263 వినతులు

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

‘మీ కోసం’కు 263 వినతులు మార్కాపురంలో పోలీస్‌ గ్రీవెన్స్‌కు 27 అర్జీలు కంటైనర్‌ ఇల్లు దగ్ధం పాల వాహనం ఢీకొని వ్యక్తి మృతి మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

ఒంగోలులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌–మీ కోసం) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 263 వినతులు వచ్చాయి. కలెక్టర్‌ పి.రాజాబాబు ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్‌ భవన్‌లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు తమ వంతుగా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

మార్కాపురం: మార్కాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌సెల్‌ (పీజీఆర్‌ఎస్‌)కు 27 అర్జీలు అందాయి. డీఎస్పీ నాగరాజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అర్జీదారులతో పోలీసులు మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కనిగిరి, వై.పాలెం, గిద్దలూరు సీఐలు శ్రీనివాసరావు, అజయ్‌కుమార్‌, రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.

సుమారు రూ.6 లక్షల నష్టం

తాళ్లూరు: కంటైనర్‌ ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని లక్కవరం ఎస్సీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు కూకట్ల వీరబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో కంటైనర్‌ ఇంట్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి వెంటనే దర్శి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. ఫైరింజన్‌ వచ్చి మంటలు ఆర్పేలోపే ఇంట్లోని కంప్యూటర్‌, ఫోన్‌లు, ఫ్యాన్ల్‌, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వీరబ్రహ్మం తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కొనకనమిట్ల: పాల లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై పెదారికట్ల–చినారికట్ల మధ్యలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..చినారికట్ల గ్రామానికి చెందిన కాకునూరి కోటిరెడ్డి(35) తన మోటార్‌ సైకిల్‌పై పెదారికట్ల వెళ్లి తిరిగి చినారికట్ల వస్తున్నాడు. ఆ క్రమంలో పొదిలి నుంచి కనిగిరి వైపు వెళుతున్న పాల లారీ ఎదురుగా మోటార్‌ సైకిల్‌పై వస్తున్న కోటిరెడ్డిని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన కోటిరెడ్డి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ సంఘటనా స్థలానికి కొద్దిదూరం వెళ్లి ఆగింది. కాగా మృతుడు కోటిరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కొనకనమిట్ల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. కోటిరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉప్పుటూరు (చినగంజాం): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. ఉప్పుటూరు గ్రామానికి చెందిన షేక్‌ నాజర్‌వలి (20) తల్లిదండ్రులు విడిపోయి తల్లి వేరొక వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ వెల్డింగ్‌ పనులు చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం అతని తండ్రి మృతిచెందాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన నాజర్‌వలి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వీఆర్వో, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement