న్యూస్‌రీల్
జిల్లాలో తీవ్రమవుతున్న డీజిల్, పెట్రోలు కొరత పెరుగుతున్న పెట్రోలు బంకుల మూత అరకొరగా తెరచిన చోట భారీగా క్యూలైన్లు నిద్రమత్తులో జోగుతున్న సివిల్ సప్లై విభాగం అధికారులు ఆయిల్ కంపెనీల అధికారులకు, జిల్లా అధికార యంత్రాంగానికి సఖ్యత లోపం అధికారుల మాట వినే పరిస్థితిలో లేని ఆయిల్ కంపెనీల అధికారులు
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఒంగోలు రత్నమహల్ థియేటర్ సెంటర్‌లోని పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు కోసం ద్విచక్ర వాహనాల రద్దీ
జిల్లాలో డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి... డీజిల్ కోసం ట్రాక్టర్లు, వాహనాలు తీసుకొచ్చే పరిస్థితులు లేక డ్రమ్ములు, డబ్బాలు తీసుకొని ప్రజలు, వాహనదారులు పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు పెట్రోలు బంకులు డీజిల్ లేక మూతపడగా, మరికొన్ని బంకులు మూత వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల పెట్రోలు కూడా నిండుకుంది. అరకొరగా తెరచిన చోటా గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి చక్కదిద్దాల్సిన సివిల్ సప్లై అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు.
ఆయిల్ నిల్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ఉన్న స్టాకు అయిపోవడంతో ఒక్కొక్కటిగా పెట్రోలు బంకులు మూతపడుతున్నాయి. చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మూడు రోజులకు ఒక లోడు డీజిల్.. పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. తీరా కొరత ఏర్పడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెట్రోలు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అధికారులు స్పందించారు. డబ్బులు కట్టిన మూడు రోజులకు ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. గతంలో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు కూడా పైనుంచి సరఫరా సక్రమంగా రాకపోవటంతో పెట్రోలు బంకులకు సరఫరా కట్టడి చేశాయి. దాంతో డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూత పడే పరిస్థితి నెలకొంది. ఒక పక్క రబీలో వరి కోతలు ఊపందుకున్నాయని, దాంతో ఇంధన కొరతతో వరికోత మిషన్లు జిల్లాలో కనపడటం లేదు. ఎక్కడి వరికోత మిషన్లు అక్కడే ఆగిపోయాయి. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపలసాగుపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.
నిద్ర మత్తులో సివిల్ సప్లయ్ విభాగం అధికారులు...
పూర్తిగా ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంకులకు డీజిల్ సరఫరా కట్టడి చేసేవరకూ జిల్లా సివిల్ సప్లయి విభాగం అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితులను, కనీసం రెవెన్యూ అధికారులు గమనించకపోవటం వల్లనే జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడి పెట్రోలు బంకులు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. చివరకు సూరారెడ్డిపాలెంలోని ఐఓసీ, బీపీసీఎల్ అవుట్‌లెట్లలోనే డీజిల్ ఆపేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అలాంటిదేమీ లేదని అధికార యంత్రాంగం బుకాయిస్తోంది.
ఆయిల్ కంపెనీలు..జిల్లా యంత్రాంగం మధ్య కొరవడిన సఖ్యత:
జిల్లాలో ఉన్న ఆయిల్ కంపెనీల అధికారులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య సఖ్యత కొరవడింది. ఆయిల్ కంపెనీల అధికారులు పెట్రోలు బంకుల నిర్వాహకులను కట్టడి చేస్తున్నారు. ఇటు అధికారులకు మాత్రం ఆయిల్ నిల్వలు సక్రమంగా ఉన్నాయని అధికారులను పక్కదారి పట్టిస్తున్నారు. మూడు రోజులకు ఇవ్వాల్సిన లోడు ఇవ్వకుండా డీజిల్ సరఫరా పూర్తిగా కొన్ని ప్రాంతాలకు నిలిపేశారు. దాంతో మార్కాపురం జిల్లాలో 58 బంకుల్లో నోసా్‌ట్‌క్ బోర్డులు పెట్టగా, ప్రకాశం జిల్లాలో 40కి పైగా పెట్రోలు బంకులు మూతపడ్డాయి. అధికారులు మాత్రం నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి, ప్రజలు అధైర్యపడవద్దని చెబుతున్నారు.


