విద్యుదాఘాతానికి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి వృద్ధుడు మృతి

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

విద్యుదాఘాతానికి వృద్ధుడు మృతి ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి 29 నుంచి జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నీ నీటి వనరులను సంరక్షించాలి

పెద్దారవీడు: విద్యుత్‌ తీగలు పక్కకు తొలగించే సమయంలో విద్యుదాఘాతానికి గురై వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో దేవరాజుగట్టు గ్రామ సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల గుండంచర్ల కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది. కాంట్రాక్టర్‌ నిర్మాణ భవనాలకు నీటిని చల్లేందుకు నంద్యాల జిల్లా మహానంది గ్రామానికి చెందిన పి.ధర్మయ్య(60) పనిలో పెట్టగా..రాత్రిపూట కాపాలాగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిర్మాణ భవనాల గోడలకు నీళ్లు చల్లిన అనంతరం కరెంట్‌ తీగలను చేతితో పట్టుకొని పక్కకు తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ధర్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మార్కాపురం జిల్లా ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.

అద్దంకి రూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని అద్దంకి వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని ఒక పార్టీ అధినేతను, పార్టీకి చెందిన మహిళలను కించపరిచేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. బాధ్యతాయుతమైన పత్రికా రంగంలో ఉండి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపేలా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తాళ్లూరు: మండంలోని తూర్పుగంగవరం, రామభద్రాపురం గ్రామ పెద్దల సహకారంతో ఈ నెల 29న జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాంభద్రాపురం గ్రామ ఎర్రతిప్ప ప్రాంతంలో ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్‌ విజేతలకు దాతల సహకారంతో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేలు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌, బెస్ట్‌ బౌలర్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ బహమతులు కూడా అందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంత క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న జట్లు రూ.999 ప్రవేశ రుసుం చెల్లించి 28వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848658857, 9392599961, 7995411655ను సంప్రదించాలని సూచించారు.

ఒంగోలు సబర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జలధార– జల హారతి అవగాహన శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు సీపీఆర్‌అండ్‌ఆర్‌డీ అడిషనల్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాదు పేర్కొన్నారు. ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన ఏపీడీలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్‌ కమిషనర్‌ ఎం. శివ ప్రసాద్‌ హాజరై జలధార–జల హారతి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై సమగ్రంగా అవగాహన కల్పించారు. డ్వామా పీడీ జి. జోసెఫ్‌ కుమార్‌ మాట్లాడుతూ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, జల సంరక్షణపై సామూహిక బాధ్యత పెంపొందించాలన్నారు. చెరువుల పూడికతీత, చెరువుగట్ల బలోపేతం, చెక్‌డ్యామ్‌ల పూడికతీత, మరమ్మతులు, ఫీడర్‌ ఛానల్‌ పునరుద్ధరణ పనులు, తూముల మరమ్మతులు వంటివి నిర్వహించాలన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ వరలక్ష్మి, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ ఎస్‌ఈ అబ్బు తమీమ్‌, పీడీ మార్కాపురం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement