నాటక రంగానికి జీవం పోయాలి | - | Sakshi
Sakshi News home page

నాటక రంగానికి జీవం పోయాలి

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీల ముగింపు సభలో వక్తలు

మార్టూరు: నేటి పోటీ సమాజంలో ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో నిజాలను నిర్భయంగా చెప్పగల, చూపించగల నాటికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలవురు వక్తలు పేర్కొన్నారు. మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 16వ నాటిక పోటీలు చివరి రోజు ఆదివారంతో ముగిశాయి.

తండ్రీకూతుళ్ల అలసటలేని పోరాటం..

చివరి రోజు మొదటి ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారి సహన నాటికను ప్రదర్శించారు. నేటి ప్రపంచంలో బతకాలంటే సమస్యలు, ఘటనలతో జతకడుతూ ముందుకు సాగాలని.. న్యాయం కోసం నిజాయితీగా అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ ప్రయాణం సాగించాలన్న నాటిక సారాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటీనటుల అభినయం ప్రశంసలు అందుకుంది.

20 రకాల శరీర తత్వాల మనుషులతో..

రెండో ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి జ్యోతిరాజ్‌ భీశెట్టి రచించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికకు గోవాడ వెంకట్‌ దర్శకత్వం వహించారు. సృష్టిలో ఉత్తమమైన మానవ జన్మలో సీ్త్ర, పురుషుల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ పురాణాల కాలం నుంచి నేటి వరకు, ఆదిమానవుని యుగం నుంచి ఇప్పటి వరకు సీ్త్ర పురుషులే కాకుండా మానవ జాతిలో 20 రకాల శరీర తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారనే ఇతివృత్తంతో సాగిన ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సీ్త్ర, పురుషులను మాత్రమే గౌరవించే బూటకపు నాగరికతలో విభిన్న శరీరతత్వం గల వారు ఎలా బతుకుతున్నారు, అలాంటి వారికి ఎలాంటి గౌరవం, గుర్తింపు ఉంది అనే సరికొత్త కోణంలో నాటిక ప్రదర్శన సాగింది. వారి బాధలు, అవమానాలను కళ్లకు కట్టినట్టు చూపారు. వారూ మనుషులే అన్న జ్ఞానాన్ని పొంది గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాటిక ద్వారా సమాజానికి చాటారు.

డబ్బు కోసం ఎంత నీచానికై నా!

కాకినాడ బీవీ కేక్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘కన్నీటికి విలువెంత’ నాటిక మనిషి డబ్బు కోసం ఎంతటి నీచనికై నా దిగజారుతున్నాడనే ఇతివృత్తంతో సాగింది. ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేష్‌ కుమార్‌, ముత్తవరపు సురేష్‌ కుమార్‌ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ముత్తవరపు అరుణ్‌ కుమారి, ఎఫెక్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జేవీ మోహన్‌ రావు, శ్రీకారం కళాపరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కందిమల్ల సాంబశివరావు, జాస్తి అనూరాధ, రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు మాదాల సాంబశివరావు, డాక్టర్‌ చెరుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement