ఇంధనం కోసం ఆందోళన అక్కర్లేదు | - | Sakshi
Sakshi News home page

ఇంధనం కోసం ఆందోళన అక్కర్లేదు

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ పి.రాజాబాబు చెప్పారు. ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆదివారం ఉదయం కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్థన్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సంబంధిత శాఖల అధికారులు, ఆయిల్‌ కంపెనీల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దాని కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్‌ బంకుల్లో బల్క్‌ ఇంధన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇంధన రిటైల్‌ ఔట్‌లెట్లను తనిఖీ చేయాలని, అక్రమ నిల్వలు కలిగి ఉంటే కేసులు నమోదు చేయాలని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంధన లభ్యతపై అపోహలు వద్దు :

మార్కాపురం కలెక్టర్‌ విజయ సునీత

కనిగిరి రూరల్‌: పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్‌ విజయ సునీత సూచించారు. ఆదివారం కనిగిరిలో పలు పెట్రోల్‌ బంకులను ఆమె తనిఖీ చేశారు. స్టాక్‌, సేల్స్‌ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పెట్రోల్‌ బంక్‌ల వద్ద రెవెన్యూ, పోలీస్‌, పౌర సరఫరా శాఖ సిబ్బందిని నియమించి పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురై డ్రమ్ములు, క్యాన్లలో ఇంధనం నిల్వ చేయవద్దని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ నర్రా జయలక్ష్మి, ఆర్‌ఐ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

కలెక్టర్‌ పి.రాజాబాబు హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement