● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
పామూరు: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ఔట్‌లెట్స్ మొత్తం 116 ఉన్నాయని వాటిలో అన్ని చోట్ల పెట్రోల్ ఉందని, పెట్రోల్ ఎలాంటి కొరత లేదన్నారు. ఆదివారం సాయంత్రానికి 27 ఆర్‌ఓఎల్‌లలో డీజిల్ స్టాక్ లేక సరఫరా నిలిచిందన్నారు. డీజిల్, పెట్రోల్ సరఫరా, వాడకం, కొరత నివారణ మొదలైన అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయం, ట్రాన్స్‌పోర్ట్, ఇతర పరిశ్రమలు మొదలైన వాటికి కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని డీజిల్, పెట్రోల్ రిటైల్ ఔట్‌లెట్స్‌లలోని స్టాక్స్‌ను, సరఫరాను, అమ్మకాలను పర్యవేక్షించడంతో పాటు అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి రిటైల్ ఔట్‌లెట్‌కు ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్‌ను ఉపేక్షించమని, ఎక్కడైనా డీజిల్ అక్రమ నిల్వలు ఉంచినట్లు గానీ, అక్రమాలు జరిగినట్లు సమాచారం ఉంటే వారికి తెలియజేయాలని లేదా టోల్ ఫ్రీ నంబర్ 7013308642కు ఫిర్యాదు చేయాలన్నారు. డీజిల్ కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయని, ఇబ్బందులు తప్పవనే ప్రచారంతోనే డీజిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడుతోందని, ఎవరు అపోహలు నమ్మవద్దని డీజిల్, పెట్రోల్ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. సమావేశంలో తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావు పాల్గొన్నారు.


