గుదిబండ..! | - | Sakshi
Sakshi News home page

గుదిబండ..!

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

భక్తుల మదిలో

భక్తుల మదిలో

బల్లికురవ: గ్రానైట్‌ క్వారీల నిర్వాహకుల నిర్లక్ష్యం భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి పలు గ్రామాల భక్తులు అభివృద్ధి చేసుకున్న ఆలయం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. బల్లికురవ మండలంలో నెలకొన్న ఈ పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామాన్ని 12వ శతాబ్దంలో రాజులు పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆ గ్రామం నుంచి నక్కబొక్కలపాడు వెళే్‌ల్‌ రహదారిలో కొండకు తూర్పు భాగంలో ఉన్న కుండంలో అప్పట్లో సంవత్సరం పొడవునా నీళ్లుండేవి. మునులు ఇక్కడ స్నానాలు చేసి తపస్సు చేసుకునేవారని, గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేసేవారని పురాణగాధ. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడు సంవత్సరాలుగా కొణిదెన పంచాయతీలోని గంగపాలెం, పరిసర గ్రామాల భక్తుల సహకారంతో లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.

గ్రానైట్‌ వృధా రాళ్లు దొర్లిస్తుండటంతో ముప్పు...

కొండకు పైభాగంలో గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తూ వృధా రాళ్లను ప్రతిరోజూ పొక్లెయిన్‌తో బ్రహ్మకుండంలోకి దొర్లిస్తున్నారు. రెండేళ్లకుపైగా ఇలాగే దొర్లిస్తుండటంతో బ్రహ్మకుండం నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతోంది. ఇదే కొనసాగితే అది కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కుండం కట్టలు పటిష్టం చేయడంతో పాటు లక్ష్మీదేవి సమేత లక్ష్మీనారాయణుడు, బ్రహ్మదేవుడు, సమీపంలోని మర్రిచెట్టు అరుగుపై జంటనాగులు, గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగలింగేశ్వరుడు, పార్వతీ అమ్మవారు, దక్షిణామూర్తి, ఆంజనేయస్వామి, సంతాన నాగేంద్రుడు, నవగ్రహాలు, ఓంకార ధ్యాన పరమేశ్వరుడు విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నుంచి ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేసి కరెంటు సౌకర్యం కల్పించారు. కార్తీకమాసంలో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కడ స్నానాలు, పూజలు చేస్తుంటారు.

ఈర్లగంగమ్మ ఆలయంపైనా వృధా రాళ్లు...

కొణిదెన రెవెన్యూలోని నక్కబొక్కలపాడు గ్రామ సమీపంలో ఈర్లకొండకు దిగువ భాగంలో 12వ శతాబ్దంలో ఈర్ల గంగమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కొండ చుట్టూ 30 పైచిలుకు గ్రానైట్‌ క్వారీలున్నాయి. ఇక్కడ రాయి తీసే క్రమంలో వచ్చే వృధా రాయిని ఆలయంపైకి దొర్లిస్తున్నారు. దీంతో ఆలయంలోని విగ్రహాలను దుమ్ము కమ్మేస్తోంది. ఆలయంపైకి రాళ్లు నెట్టవద్దని తాము చెబుతున్నా.. గ్రానైట్‌ క్వారీల నిర్వాహకులు వినిపించుకోవడం లేదని ఆలయ కమిటీ ప్రతినిధులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆలయాలపై, బ్రహ్మకుండంలోకి రాళ్లు దొర్లించకుండా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నక్కబొక్కలపాడు సమీపంలోని ఈర్ల గంగమ్మ బ్రహ్మకుండానికి గ్రానైట్‌ వృధా రాళ్ల గండం

కొండపై నుంచి గ్రానైట్‌ వృధా రాళ్లను బ్రహ్మకుండంలో దొర్లిస్తున్న నిర్వాహకులు

భయాందోళనలో భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు

ఆలయంలోని విగ్రహాలను కమ్మేస్తున్న దుమ్ము

ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయం కనుమరుగయ్యే ప్రమాదం

లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన భక్తులు

పట్టించుకోని పాలకులు, అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement