సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య సమస్యల పరిష్కారానికి చర్యలు డిప్యూటీ ఎంపీడీఓపై దాడికి యత్నం

బల్లికురవ: ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకట నారాయణ (25) బీటెక్‌ పూర్తిచేసి చైన్నెలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అప్పులు ఎలా తీర్చాలా అని మదనపడుతూ గత బుధవారం వలపర్ల వెళ్లి పురుగుల మందు (గడ్డి మందు) కొనుగోలు చేసి దారిలోనే తాగి ఇంటికి చేరాడు. అస్వస్తతతో బాధపడుతున్న అతని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వెంకట నారాయణ మృతిచెందాడు. మృతునికి వివాహం కాలేదు. అతని తండ్రి కాంతయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.

పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబు

చీమకుర్తి రూరల్‌: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలడిగి తెలుసుకున్నారు. మంచినీరు, ఇంటి స్థలాలు, శ్మశాన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఆయా సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. స్థానికంగా దొరికే బబుల్‌ వాటర్‌ వాడవద్దని, అందులో క్లోరినేషన్‌ ప్రక్రియ సక్రమంగా ఉండదని గ్రామస్తులకు కలెక్టర్‌ సూచించారు. గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేసే వాటర్‌ తాగి ఆరోగ్యంగా ఉండారన్నారు. కలెక్టర్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

వెలిగండ్ల (కనిగిరి రూరల్‌): వెలిగండ్ల డిప్యూటీ ఎంపీడీఓ సింగంపల్లి రాంప్రసాద్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన సంఘటన శనివారం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. డిప్యూటీ ఎంపీడీఓ రాంప్రసాద్‌ తన విధుల్లో భాగంగా మండలంలోని రామగోపాలపురం స్వర్ణ గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో సచివాలయంలో కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన సర్వేలకు సంబంధించిన రికార్డులు, గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఆ తరుణంలో ఒక్కసారిగా గ్రామానికి చెందిన ఎం.నాగేంద్ర అసభ్య పదజాలంతో దూషించి రాంప్రసాద్‌పై భౌతిక దాడికి ప్రయత్నించాడు. తాను అధికార పార్టీకి చెందిన వాడినని బెదిరిస్తూ కర్ర తీసుకుని తనపైకి వచ్చినట్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో డిప్యూటీ ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement