ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శనివారం నిరాఽహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌గా ఉన్నారని, వారి సీనియార్టీ జాబితా తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ పూల్ నందు కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 40 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే సింగిల్ టీచర్ సెలవు పెడితే.. ఆ పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారులు సీఆర్‌ఎంటీలను కేటాయించాలన్నారు. పైన తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు కోరారు. అనంతరం డీఆర్వో ఓబులేసును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు చిరంజీవి, రమేష్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, రవికుమార్, శ్రీను, జయకుమారి, సుబ్బాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకుల డిమాండ్
కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష


