వాహనాలు జాగ్రత్తగా నడపాలి | - | Sakshi
Sakshi News home page

వాహనాలు జాగ్రత్తగా నడపాలి

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

కన్వెక్స్‌ మిర్రర్ల ఏర్పాటును పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్‌రాజు

ఒంగోలు టౌన్‌: రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా పనిచేద్దాం.. రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తుకు పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన కన్వెక్స్‌ మిర్రర్ల ఏర్పాటును శనివారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న 115 ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రదేశాలలో కన్వెక్స్‌ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తద్వారా వాహనచోదకులకు ముందస్తు హెచ్చరికలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనదారులు బ్లాక్‌స్పాట్ల వద్ద మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని చెప్పారు. సైన్‌ బోర్డులపై ఉన్న హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలలో నష్టపోయిన కుటుంబాల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతోందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి చేరేలోపు తమ కోసం భార్యా బిడ్డలు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయం మరిచిపోకూడదన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న రోడ్డు భద్రతా చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement