అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నాం

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అంకయ్య

మార్కాపురం:

జిల్లాలో అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అంకయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతుండటంపై ఈ నెల 24వ తేదీ సాక్షి దినపత్రికలో ‘సేకరించు.. సమీకరించు.. విక్రయించు’.. అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అంకయ్య స్పందించారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 3.33.587 మంది కార్డుదారులు ఉండగా, 2.87.517 మంది కార్డుదారులు ఏప్రిల్‌ నెలలో రేషన్‌ తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 మండలాల్లో కార్డుదారులు తమకు సంబంధించిన సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, మంచంలో ఉన్న వారు, విభిన్న ప్రతిభావంతులు 38,843 మంది ఉండగా, అందులో 33,721 కార్డుదారులకు సరుకులు అందజేసినట్లు తెలిపారు. మార్కాపురం ఆర్డీఓ త్రిపురాంతకం మండలంలో 5 చౌకదరల దుకాణాలను తనిఖీ చేసి కార్డుదారులను విచారణ చేసినట్లు చెప్పారు. తమ డీలరు బియ్యం ఇచ్చినట్టు వారు తెలిపారన్నారు. ప్రతినెలా 15వ తేదీలోపు కార్డుదారులు తమకు రావాల్సిన సరుకులను డీలర్ల నుంచి తీసుకుంటున్నారని, బియ్యంకు బదులుగా డబ్బులు తీసుకోవడం లేదని తెలిపారు. ఎవరికై నా రేషన్‌ సరుకులు ఇవ్వకపోతే 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని లేదా సంబంధిత తహసీల్దార్లకు, జిల్లా పౌరసరఫరాల అధికారి మొబైల్‌ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని అంకయ్య సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement