జిల్లాలో పలుచోట్ల డీజిల్ కొరతతో నిలిచిన పెట్రోలు బంకులు ఒంగోలు నగరంలో మూతపడిన కొన్ని పెట్రోలు బంకులు పై నుంచి సరఫరా లేదని చెప్తున్న నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ఆయిల్ కోసం
దర్శి/మార్కాపురం/అద్దంకి: జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత వాహనదారులను వేధిస్తోంది. డీజిల్, పెట్రోలుకు కొరత లేదని, ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తగినంత ఆయిల్ సరఫరా లేక ఒక్కొక్కటిగా పెట్రోలు బంకులు మూతపడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ దొరకడం లేదని వాహనదారులు క్యాన్లలో డీజిల్ కొట్టించుకుని నిల్వ పెట్టుకుంటున్నారు. దీంతో బంకుల్లో ఉన్న స్టాకు అయిపోయి నోస్టాక్ బోర్డులు పెడుతున్నారు. దర్శిలో కొన్ని బంకుల్లో శనివారం సాయంత్రానికి ఆయిల్ ట్యాంకర్లు రావడంతో అక్కడ వాహనదారులు బారులుతీరారు. అయినా అడిగినంత డీజిల్ కొట్టడం లేదు. డీజిల్ కొరతల వార్తలతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ అమ్మేవాళ్లు భారీగా నిల్వలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. మార్కాపురంలో 8 పెట్రోల్ బంకులున్నాయి. పట్టణంలో సుమారు 2 వేల ఆటోలు, రూరల్‌లో మరో 500 ఆటోలు, వెయ్యికి పైగా కార్లు, జీపులు, 50 లారీలు ఇంకా పదికి పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో రూ.500కు మించి డీజిల్ ఇవ్వడం లేదని వాహనదారులు వాపోతున్నారు. పొదిలిలోనూ ఒకటి రెండు పెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు పెట్టారు. యర్రగొండపాలెంలో డీజిల్, పెట్రోలు రెండూ లేవని పెట్రోలు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అద్దంకి పట్టణంలోని 12 పెట్రోలు బంకుల్లో శనివారం సాయంత్రం నుంచి డీజిల్ నిండుకుంది. దాంతో ఆటోవాలాలు రాత్రి సమయంలో బంకుల వద్ద క్యూ కట్టారు. అయితే డీజిల్ లేదని నిర్వాహకులు చెప్పడంతో చేసేది లేక ఆటోలను అక్కడే నిలిపి కూర్చుకున్నారు. ఏ బంకులోనూ నో స్టాట్ బోర్డు పెట్టలేదు కానీ వచ్చిన వారికి లేదని చెబుతున్నారు. సంతమాగులూరులో రాత్రి సమయంలో ఒక డీజిల్ ట్యాంకరు రావడంతో ఆటో వాలాలు ఎగబడ్డారు. ఒంగోలు నగరంలోనూ సాయంత్రానికి పలుచోట్ల పెట్రోలు బంకులు మూతపడ్డాయి. తెరచి ఉంచిన బంకుల్లోనూ డీజిల్ లేదని, సాధారణ పెట్రోలుకు బదులు పవర్ పెట్రోలు మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
చిరువ్యాపారులు, వాహనదారులకు ఇక్కట్లు:
డీజిల్ కొరత చిరువ్యాపారులు, వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆటోలు, చిన్న చిన్న ట్రాలీ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే వారు, కూరగాయలు, సరుకులు వంటి నిత్యం రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలు మూలన పడే అవకాశం ఉంది. బస్సులు లేని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోలు నడిపే పరిస్థితి లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ట్రాక్టర్‌లతో చేసే వ్యవసాయ పనులు ఆగిపోతాయి. సంబంధిత అధికారులు స్పందించి డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


