స్మార్ట్‌గా దగా | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా దగా

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

మధ్యాహ్న భోజన కార్మికులపై స్మార్ట్‌ కిచెన్‌ పిడుగు స్మార్ట్‌ కిచెన్‌ల ద్వారా మధ్యాహ్న భోజనం అందించే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఒకే చోట భోజనం తయారు చేసి పాఠశాలలకు పంపిస్తే తమ ఉపాధి ప్రశ్నార్థకమంటున్న మధ్యాహ్న భోజన కార్మికులు స్మార్ట్‌ కిచెన్‌ల నిర్మాణాల కోసం ఇప్పటికే స్థలాలు గుర్తిస్తున్న అధికారులు కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకేనంటున్న ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికులు స్మార్ట్‌ కిచెన్‌లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు

కంభం:

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టి, కూటమి వర్గీయులకు కట్టబెట్టేందుకే స్మార్ట్‌ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తారు. 1500–2000 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్‌ కిచెన్‌ ఉంటుందని విద్యార్థుల సంఖ్యను బట్టి మండలంలో ఒకటి లేదా రెండు స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అందుకోసం 1200 గజాల స్థలం గుర్తిస్తే ప్రభుత్వ నిధులతో అక్కడ కిచెన్‌ నిర్మాణం చేపట్టి సామగ్రిని అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల విద్యాశాఖాధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

ప్రశ్నార్థకంగా మధ్యాహ్న భోజన కార్మికుల భవిష్యత్తు:

గత 24 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం హైస్కూల్స్‌లో విద్యార్థికి రూ.8.55, ప్రాథమిక పాఠశాలల్లో రూ.5.50 చొప్పున చెల్లిస్తున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా మూడు, నాలుగు నెలలకొకసారి వస్తాయి. చాలీ చాలని జీతాలతో ఏళ్ల తరబడి ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తే 25 మందికి ఒకరు, 25–100 మంది విద్యార్థులకు ఇద్దరు, అంతకన్నా ఎక్కువ విద్యార్థులుంటే ప్రతి వంద మందికి ఒకరిని చొప్పున అదనంగా విధుల్లోకి తీసుకుంటారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 4500 మంది మధ్యాహ్న భోజన కార్మికుల్లో సగానికి పైగా ఉపాధి కోల్పోనున్నారు. స్మార్ట్‌ కిచెన్‌ నిర్వాహకులు అంతా కూటమి నాయకులే ఉండనుండటంతో ఇప్పుడు పనిచేస్తున్న వారిని సైతం తొలగించి తీసుకునే కొద్ది మందిని కూడా వారి మనుషులనే ఉంచుకుంటారని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఆందోళన బాటలో మధ్యాహ్న భోజన కార్మికులు:

తమకు వ్యతిరేకంగా చేపట్టిన స్మార్ట్‌కిచెన్‌లు వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాల వారీగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌ల వద్ద, మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టారు. చాలీచాలని జీతాలతో పని చేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, స్మార్ట్‌కిచెన్‌ల ప్రక్రియను నిలిపేసి తమకు కనీస గౌరవ వేతనం అమలు చేయాలని, ప్రమాద బీమా, ఈఎస్‌ఐ అమలు చేయాలని, వంటపాత్రలు, గ్యాస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కంభం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

Advertisement
 
Advertisement
Advertisement