టీచర్ల బదిలీలపై సందిగ్ధం నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12,447 మంది ఎంఈఓలు, హెచ్‌ఎంలు, టీచర్లు ఈ ఏడాది 1000 మంది వరకూ బదిలీ జరిగే అవకాశం గతేడాది బదిలీల్లో గందరగోళం బదిలీలకు ముందే సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ ఆందోళన
ఉపాధ్యాయుల బదిలీలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బదిలీలు చేపడతారా.? ఏ ప్రమాణాలు అమలు చేస్తారు.? అనే దానిపై స్పష్టత లేక ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఏడాది అస్తవ్యస్థ నిర్ణయాల అనుభవం దృష్ట్యా ఈసారి ప్రక్రియ ఎలా ఉంటుందో అన్నదే ప్రధాన చర్చగా మారింది.
ఈసారీ
గత ఏడాది అంతా గందరగోళం...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు గత ఏడాది మే 21వ తేదీ ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజులు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బదిలీలు ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలంటూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఆ తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జూన్ 11వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా కౌన్సెలింగ్ జరగడం గమనార్హం. ఒంగోలు పాత జిల్లా పరిషత్ భవనం వద్ద బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. బదిలీల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీల్లో నిబంధనలు పాటించలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. సాధారణంగా కౌన్సెలింగ్లో ఖాళీలు చూపించిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు తనకు అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా అధికారులు బదిలీలు చేశారని విమర్శలు వచ్చాయి. కౌన్సెలింగ్లో సంబంధిత అధికారే తాను సూచించిన స్థానానికి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తీరుపై ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటే.. ఆ శాఖలో ఉన్న ఖాళీలను చూపించి ఆప్షన్లు పెట్టించుకుంటారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకున్నా.. అవేమీ చెల్లుబాటు కాలేదన్న విమర్శలు వచ్చాయి. మాన్యువల్ కౌన్సెలింగ్ పోరాడి సాధించుకున్నామన్న తృప్తి లేకుండా పోయిందని ఉపాధ్యాయ సంఘాలు అధికారుల తీరుపై మండిపడ్డాయి. అనేక గందరగోళాలు, ఆరోపణల మధ్య మొత్తం 5458 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. సాంకేతికంగా వీరంతా బదిలీ అయిన కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేసినా చాలామంది పాత పోస్టులోనే కొనసాగుతున్నారని సమాచారం. డీఎస్సీ 2025 ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు అయితే కొత్త టీచర్లు వచ్చారుగానీ బదిలీ ఉపాధ్యాయులు కదిలే పరిస్థితి లేకుండాపోయిందని తెలిసింది. గత ఏడాది చేపట్టిన గందరగోళ బదిలీల్లో దాదాపు 356 మంది మిగులుగా తేలారు. హేతుబద్ధీకరణ ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం వీరిని క్లస్టర్ మొబలైజ్ టీచర్లుగా ప్రకటించారు. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీల్లో తమను పరిగణలోకి తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఒంగోలు సిటీ:
ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యాశాఖ పరిధిలో (12 నియోజకవర్గాలు) మొత్తం 12,447 మంది ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో బదిలీలపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది బదిలీలు జరుగుతాయా? ఏ ప్రాతిపదికన జరుగుతాయనే అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గతేడాది ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్థ నిర్ణయాలతో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత బదిలీలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బదిలీలకు సంబంధించి తొలుత జిల్లాల వారీగా విభజన చేసిన తర్వాతే బదిలీలు జరుగుతాయని ప్రచారం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, సీనియార్టీని పరిగణనలోకి తీసుకునేటప్పుడు గందరగోళం లేకుండా ఉండటానికి ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికనే ఈ జాబితాలను రూపొందిస్తున్నారని తెలిసింది. యూ డైస్‌లో రేషనలైజేషన్‌కు సంబంధించి వివరాల నమోదుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అలాగే విద్యాశాఖ జిల్లా అధికారుల నుంచి బదిలీలకు సంబంధించి వివరాలు సేకరించినట్టు సమాచారం. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పోస్టుల రేషనలైజేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందించారని సమాచారం. ఈ బదిలీల్లో మే 30వ తేదీ వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారని, స్కూల్స్‌లో ఏప్రిల్ 30 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల రేషనలైజేషన్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బదిలీల్లో దివ్యాంగులకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో వారికి మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. బదిలీల ప్రక్రియలో సీనియార్టీయే అత్యంత కీలకం. సర్వీస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్లు, ఇతర ప్రత్యేక కేటగిరీల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఈ పాయింట్ల విషయంలో గతంలో కొంత గందరగోళం నెలకొంది.
బదిలీలపై భిన్న కథనాలు...
ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన సర్వేలో పాల్గొనే విభాగాలకు వచ్చే ఏడాది మార్చి వరకూ ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఈ సర్వేలో ఉన్నందున ఈ ఏడాది బదిలీలు జరిగే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా వేసవి సెలవులు ప్రారంభమైనా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది బదిలీలు అనుమానమేనని అంటున్నారు. ఒక వేళ బదిలీలు చేపడితే గత ఏడాదిలా కాకుండా ఉమ్మడి జిల్లాలో పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
1000 మంది వరకూ
బదిలీకి అవకాశం...
ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు చీరాల, పర్చూరు నియోజవర్గాల పరిధిలో అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 12,447 మంది ఉన్నారు. ఇందులో 112 మంది ఎంఈవోలు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు 820 మంది, స్కూల్ అసిస్టెంట్లు 4645 మంది, ఎస్జీటీలు 6172 మంది, పీడీలు 398 మంది, ఉర్దూ టీచర్లు 300 మంది ఉన్నారు. గత ఏడాది 5458 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరిగాయి. ఈ ఏడాది సుమారు 1000 మంది వరకూ ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
బదిలీలకు ముందే సమస్యల పరిష్కారం కోసం పోరాటం...
బదిలీల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పీఆర్‌టీయూ పిలుపునిచ్చింది. ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటూ ఆ సంఘ నేతలు మండిపడుతున్నారు.


