నీళ్ల చారు, చెంచాడు పొడి కూర.! | - | Sakshi
Sakshi News home page

నీళ్ల చారు, చెంచాడు పొడి కూర.!

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

నీళ్ల చారు, చెంచాడు పొడి కూర.!

ఇలాంటి ఆహారంతో రోగులకు పోషకాలు ఏ విధంగా అందుతాయి.? వై.పాలెం ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం:

దోసెడు అన్నంలోకి కాసింత నీళ్ల చారు, చెంచాడు పొడి కూరతో రోగులకు పౌష్టికాహారం ఏ విధంగా అందుతుందని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. స్థానిక ఏరియా వైద్యశాలను గురువారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అదే సమయంలో రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అందులో కోడి గుడ్డు కనిపించలేదు. చట్నీ, పెరుగు వడ్డించలేదు. దీంతో ఒక రోగికి అందజేసిన ప్లేటును ఆయన తీసుకుని చూశారు. అందులో కొంచం అన్నం, ఆ అన్నంలో నీళ్ల చారు, ఒక టీ స్పూన్‌ పొడి కూర ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విధంగా భోజనాలు పెడితే రోగులకు మంచి పోషకాలు ఏ విధంగా అందుతాయని అన్నారు. హాస్పిటల్లోని రోగులందరికీ భోజనం పెట్టకుండా కేవలం 15 శాతం మందికే పెట్టడంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్లోని ఒక వార్డులో ఎమ్మెల్యే తనిఖీ చేస్తుండగా.. మరో వార్డులోకి నర్సులు వెళ్లి.. భోజనాలు బాగా పెడుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పాలని రోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. భోజనాలకు, నర్సులకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ.. అన్నం బాగా పెట్టకపోయినా పెడుతున్నారని రోగులను చెప్పమనడంలో అర్థం ఏమిటంటూ నర్సులను మందలించారు. వైద్యశాలలో పారిశుధ్యం లోపించిందని, కేవలం జీతాల కోసమే పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైద్యశాల సూపరింటెండెంట్‌ యదిద్యాను పిలిచి హాస్పిటల్లో లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ప్రజలకు వచ్చిన రోగాలు నయం చేయించుకోవటానికి వైద్యశాలకు వస్తుంటే.. ఇక్కడ కొత్త రోగాలతో వెనుదిరిగి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితి ప్రజలకు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. రోగులందరికీ మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్‌, ఒంగోలు సుబ్బారెడ్డి, సురేష్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement