సేకరించు.. సమీకరించు.. విక్రయించు..
పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం కూటమి నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. రేషన్ దుకాణాలకు చేరిన బియ్యాన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్ మార్కెట్‌కు తరలించి డీలర్లు, కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పేదల బియ్యాన్ని గుట్టుచప్పుడుకాకుండా మిల్లుల్లో పాలిష్ పట్టి ప్రజలకు విక్రయించడంతోపాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న ఉదంతాలు గత రెండేళ్లుగా తరచూ బహిర్గతమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రేషన్ దందాపై చంద్రబాబు సర్కారు లేశమంతైనా స్పందించడం లేదు. దీంతో డీలర్లు, అధికార టీడీపీ, జనసేన నాయకులు ఆడిందే ఆటగా మారింది. ముఖ్య నేతలకు నెల నెలా ఠంచనుగా ముడుపులు అందిస్తుండటంతో ఎక్కడా దాడులు చేయకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
మార్కాపురం: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ తీరు అస్తవ్యస్తంగా తయారైంది. పౌరసరఫరాల శాఖాధికారులు కూడా డీలర్ల మాటను జవదాటకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగడం లేదు. మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల, కనిగిరి యర్రగొండపాలెం, గిద్దలూరు తదితర నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో డీలర్లు బియ్యం పంపిణీకి కొర్రీలు వేస్తున్నారు. కిలోకు 10 రూపాయల చొప్పున డబ్బు ఇస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లాలో 21 మండలాల్లో 743 రేషన్ షాపులుండగా 3,32,587 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈనెల 15వ తేదీ వరకు 2,85,900 మంది(సుమారు) బియ్యం తీసుకున్నారు. ఇంకా 47 వేల మందికి పైగా రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం 1 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి నెలా 26వ తేదీ నుంచి మరుసటి నెల 1వ తేదీ వరకు వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా మూడొంతుల మంది రేషన్ డీలర్లు ఆ నిబంధనకు తమకు వర్తించదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
పంపిణీ ఐదు రోజులే..
జిల్లా వ్యాప్తంగా దాదాపు 47 వేల మంది రేషన్‌కార్డుదారులు ఈ నెల బియ్యం తీసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీనికి వారు చెప్పే సమాధానాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎండ తీవ్రత, వలసపోవడం వల్ల బియ్యం తీసుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, త్రిపురాంతకం తదితర మండలాల్లో రేషన్ డీలర్లు బహిరంగంగానే 4 లేదా 5వ తేదీకల్లా బియ్యం అయిపోయాయనని, డబ్బులిస్తామని చెబుతున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేవు. త్రిపురాంతకం మండలంలో నాలుగు రోజులపాటు కాళ్లరిగేలా తిరిగినా బియ్యం ఇవ్వడం లేదని కార్డుదారులు ఘోష పెడుతున్నా డీలర్లు కనికరించడం లేదు. గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోనూ రేషన్ సరుకుల పంపిణీ తీరు దారుణంగా తయారైంది.
కార్డుదారుల పడిగాపులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా 1 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించేవారు. దీంతో ఐదేళ్లపాటు ప్రజలకు రేషన్‌పై సందేహాలు లేకుండా పోయాయి. ఇంటి వద్దకే వాహనం వస్తుండటంతో పనులు పోగొట్టుకోకుండా, సంతోషంగా రేషన్ తీసుకునేవారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నెలలో తొలి 15 రోజులు మాత్రమే రేషన్ షాపుల వద్ద సరుకులు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రేషన్ బియ్యం, చెక్కర కోసం పనులు పోగొట్టుకుని కార్డుదారులు షాపుల ముందు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, పలువురు డీలర్లు బహిరంగంగానే బియ్యం లేవు, కిలోకు 10 రూపాయలు డబ్బులిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు.
మార్కాపురం జిల్లాలో అస్తవ్యస్తంగా రేషన్ బియ్యం పంపిణీ
పేదలకు కేజీకి రూ.10 ముట్టజెప్పి బ్లాక్ మార్కెట్‌కు బియ్యం తరలింపు
వృద్ధులకు ఇంటి వద్దే బియ్యం ఇవ్వాలన్న నిబంధనకు పాతర
జిల్లాలో ఈ నెల రేషన్ బియ్యం తీసుకోని వారు 47 వేల మంది
చంద్రబాబు సర్కారు తీరు, డీలర్ల వ్యవహార శైలే కారణం
వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మాత్రం తప్పుడు కేసులు నమోదు
వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కేసులు
రేషన్ డీలర్లలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అక్రమ కేసులు నమోదు చేస్తుండటం టీడీపీ నేతల కుట్రలకు నిదర్శనం. మార్కాపురంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అధికారి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన డీలర్లే లక్ష్యంగా 6ఏ కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. మార్కాపురం పట్టణం, మండలంలోని రెండు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన డీలర్లపై ఆ అధికారి కేసులు నమోదు చేసి తొలగించారు. దీంతో డీలర్లు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కాగా, రోజుకు 5 షాపులు తనిఖీ చేస్తాం. ఒక్కో దుకాణం నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని డీలర్లు ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా గోడౌన్‌లోనే ఒక బస్తా బియ్యాన్ని తగ్గించి సరఫరా ఇస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


