‘ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యం’ | - | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యం’

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

‘ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యం’ వరల్డ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌లో జిల్లా వాసుల సత్తా

గిద్దలూరు రూరల్‌: పట్టణంలో కొందరు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని యల్లా వెంకటమణికంఠ వాపోయాడు. బాధితుడు మణికంఠ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని గర్రెవారి వీధిలో తనకు 3 సెంట్ల స్థలం ఉందని, ఆ స్థలానికి టీడీపీ నాయకుడు దిలీప్‌కుమార్‌, మరో కొంత మంది నకిలీ పత్రాలు సృష్టించి జేసీబీ, ట్రాక్టర్‌తో స్థలంలో పనులు చేసేందుకు వచ్చారన్నారు. విషయం తెలిసి తాను అక్కడకు వెళ్లగా తనపై దిలీప్‌కుమార్‌, మరికొందరు దాడి చేశారని వాపోయాడు. దాడిలో గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరినట్లు తెలిపాడు. పట్టణం నడిబొడ్డన ఎంతో విలువైన స్థలాన్ని అధికార గర్వంతో కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ స్థలం ఆక్రమించుకోవాలని చూశారని, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని మణికంఠ వాపోయాడు.

సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌కు 3 స్వర్ణాలు

హైజంప్‌, ట్రిపుల్‌ జంప్‌లో పీడీ శ్యామలాదేవికి గోల్డ్‌ మెడల్‌

మార్కాపురం: థాయిలాండ్‌లో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో మార్కాపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సత్తా చాటారు. కంభం మండలం రావిపాడుకు చెందిన, హరియాణాలోని పానిపట్‌ ఐఓసీలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేవీ సుబ్బారావు 5 కి.మీ, 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేల్లో బంగారు పతకాలు సాధించారు. జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లోనూ పతకాలు సాధించిన సుబ్బారావును పలువురు అభినందించారు.

పీడీ శ్యామలాదేవికి సన్మానం

వరల్డ్‌ మాస్టర్‌ స్పోర్ట్స్‌లో మహిళల విభాగంలో హైజంప్‌, ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన పీడీ శ్యామలాదేవిని గురువారం తహసీల్దార్‌ చిరంజీవి, డీవైఈఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ కె.శర్వాణి తదితరులు ఘనంగా సన్మానించారు. మార్కాపురం జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్యామలాదేవిని హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, పి.దామోదర్‌రెడ్డి, కె.ఓబులేసు తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement