ఒంగోలు సిటీ: ెషడ్యూల్ తెగల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, వారి సమస్యల పరిష్కార పురోగతి గురించి శాఖల వారీగా సమీక్షించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు నిబంధనల మేరకు వారికి రావాల్సిన నష్టపరిహారం సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ పి.రాజాబాబు ఎస్టీల పెండింగ్ సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, అద్దంకి ఆర్‌డీఓలు లక్ష్మీ ప్రసన్న, జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సింగరాయకొండ:మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ మల్లికార్జుననగర్ ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఎస్టీలకు ఆధార్‌కార్డులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్టీలకు ఆధార్‌కార్డు ఇప్పించటానికి కృషి చేయాలన్నారు. చాలా మందికి సొంత గృహాలు లేవన్నారు. ఎక్కువ మంది వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంగోలు వన్‌టౌన్: నగరంలోని జయప్రకాష్ కాలనీలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి సభ్యులతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తపట్నం: మండలంలో రంగాయపాలెం పంచాయతీని సందర్శించి ఇటీవల మరణించిన ఈగ బాలనాగు కుటుంబసభ్యులను ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పరామర్శించారు. అనంతరం మోటుమాల బకింగ్ హామ కెనాల్ సమీపంలో చేపలు పట్టుకొని జీవిస్తున్న యానాదులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యానాదులు నివాసం ఉండే గ్రామాల్లో తహసీల్దార్ జిల్లా అధికారులతో కలిసి నెలకు ఒకసారైనా పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు
ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి


