విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

రాగి తీగ అపహరించిన దుండగులు

పంటలు ఎండు ముఖం పడుతున్నాయని రైతుల ఆవేదన

పెద్దారవీడు/పొదిలి రూరల్‌: పెద్దారవీడు మండల పరిధిలోని మూడు గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను బుధవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. వివరాలు.. పెద్దారవీడులో రైతులు గొట్టం వీరారెడ్డి, గొట్టం రఘురామిరెడ్డి, గొట్టం రామనారాయణరెడ్డి, కొత్తపల్లి గ్రామంలో వెన్నా శివకృష్ణారెడ్డి, దేవరాజుగట్టు గ్రామంలో బట్టగిరి ఆదిలక్ష్మమ్మ పొలాల్లో స్తంభాల నుంచి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వరకు ఉన్న తీగలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగను అపహరించారు. మిర్చి తోటలకు నీరు పెట్టేందుకు గురువారం ఉదయాన్నే పొలం వద్దకు చేరుకున్న రైతులు ప్యానల్‌ బోర్డు స్విచ్‌ వేయగా డీప్‌బోర్‌ పనిచేయలేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి పరిశీలించగా విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మిర్చి ఎండు ముఖం పట్టకముందే ట్రాన్స్‌ఫార్మర్లు బిగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చోరీపై విద్యుత్‌ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

పొదిలి మండలంలో వారంలో 6 చోరీ..

పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గత వారం రోజుల్లో 6 విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లు చోరీ కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి రాములవీడు గ్రామానికి చెందిన రైతు యేటి సుబ్బయ్య పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి రాగితీగ అపహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement