ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో దళిత, రాజకీయ, ప్రజా సంఘాలతో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దేశంలో అగ్రకులాలకు చెందిన వారు మతం మారినప్పుడు వారి అగ్ర కుల హోదా పోనప్పుడు, వారి సామాజిక గుర్తింపు మారనప్పుడు, కేవలం దళితులు మతం మారినప్పుడు మాత్రమే ఎస్సీ హోదా రద్దు చేయడం ముమ్మాటికీ వివక్షా పూరితమేనన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని విమర్శించారు. కులం అనేది పుట్టుకతో వచ్చే సామాజిక ముద్ర అని, అది మతం మారినంత మాత్రాన పోదని పాలకులు గుర్తించాలన్నారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే గత 75 ఏళ్లుగా ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్, కుమార పిళ్ళై, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, సచార్, దేశ్‌ముఖ్ వంటి అన్ని కమిషన్లు ఒకే మాటను స్పష్టం చేశాయన్నారు. మతం మారినా దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదని, వారిపై అంటరానితనం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నాయి. ఈ శాసీ్త్రయ నివేదికలను పక్కన పెట్టి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 25 కల్పించిన సమానత్వానికి, మత స్వేచ్ఛకు విరుద్ధం అని అన్నారు. ప్రస్తుతం జస్టిస్ కె.జి. బాలకృష్ణ్ణన్ కమిషన్ నిర్వహిస్తున్న అధ్యయనం హక్కుల సాధనకు ఆఖరి అవకాశమని, నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ పరిశీలనలో దళిత క్రైస్తవుల వాస్తవ స్థితిగతులను బలంగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పోరాటంలో అన్ని ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య, దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకుడు చప్పిడి వెంగళరావు, మాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్, మాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొండలరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఇన్‌చార్జి చిడితోటి శోభన్ బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ పానుగంటి శాలెం రాజ్ మాదిగ, ఆలూరి చిరంజీవి మాదిగ, కొమ్మూరి గురటయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.


