నేర నియంత్రణపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణపై దృష్టి సారించండి

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

మార్కాపురం: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని, బహిరంగంగా మద్యం తాగే వారిని, మైనర్ల డ్రైవింగ్‌ను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్‌ వాడకం వల్ల వచ్చే అనర్థాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పోలీస్‌ నిఘా పెంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, నిర్ధిష్ట సమయంలోగా బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు సొమ్ము రికవరీ చేయాలన్నారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్‌ పోలీసింగ్‌, నైట్‌బీట్లు బలోపేతం చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. వేసవి సెలవుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వడం, చెరువులు, వాగులు, కుంటల్లో చిన్నారులు ఈతకు దిగకుండా జాగ్రత్తపడేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మలుపులు, టి–జంక్షన్‌, వై–జంక్షన్‌, యూటర్న్‌ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రేర్‌ మిర్రర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. సమీక్షలో డీఎస్పీ నాగరాజు, ఎస్‌బీ సీఐ కె.శ్రీనివాసరావు, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు రూరల్‌, అర్బన్‌, త్రిపురాంతకం సీఐలు కె.అజయ్‌కుమార్‌, మల్లికార్జునరావు, రామకోటయ్య, సురేష్‌, హసన్‌, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశం

మార్కాపురం జిల్లా పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement