బేస్తవారిపేట: ట్రాక్టర్ అదుపుతప్పి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జేబీకేపురం సమీపంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..దొనకొండ మండలం వెంకటాపురానికి చెందిన రాయనీ క్లారెన్స్, బేస్తవారిపేట మండలం కొత్తపేటకు చెందిన వినుకొండ పవన్ మోటార్‌సైకిల్‌పై తురిమెళ్ల వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ టైర్ పేలడంతో అదుపుతప్పి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. సంఘటనలో క్లారెన్స్, పవన్‌లు రోడ్డుపై పడటంతో గాయపడ్డారు. బేస్తవారిపేట 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పుల్లలచెరువు: మానసిక స్థితి సరిలేని ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలోని మాచర్ల ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. యర్రగొండపాలెం గ్రామంలోని ఇజ్రాయిల్ పేటకు చెందిన కొర్రపోలు మరియమ్మ(74) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి మాచర్ల రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మరియమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పొదిలి: మండలంలోని ఏలూరు ముసి నది వద్ద ఉన్న మద్యం దుకాణంలో మంగళవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. పూటుగా మద్యం సేవించిన బీహారీ యువకులు హోటల్ యజమానితో వాగ్వివాదానికి దిగారు. హోటల్ బిల్లు చెల్లించే విషయంలో మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. కర్రలు, ఇటుక రాళ్లతో హల్‌చల్ చేసిన బిహారీలు, హోటల్లో బీభత్సం సృష్టించారు. యజమానిపైనా దాడికి తెగబడ్డారు. హోటల్లో పనిచేస్తున్న పొదిలికి చెందిన హుస్సేన్‌పాచ్చా అనే యువకుడు అడ్డురాగా అతనిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తల, చేతులకు గాయాలైన హుస్సేన్‌ను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న హుస్సేన్ నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


