కష్టాలు, నష్టాల్లో రైతులు | - | Sakshi
Sakshi News home page

కష్టాలు, నష్టాల్లో రైతులు

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యంలా మారింది రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆదుకోవటం లేదు రైతుల గోడు కలెక్టర్‌కు వినిపించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌ రెడ్డి

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల పాలై ఊపిరి సలపని విధంగా తయారవుతున్నారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబుతో పాటు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకులతో కలిసి బుధవారం కలెక్టర్‌ పి.రాజా బాబును కలిశారు. జిల్లాలో రైతులు పడుతున్న బాధలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మీడియాతో బూచేపల్లి మాట్లాడుతూ మొక్కజొన్న పంట ఈ రబీలో పండించిన రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉన్నప్పటికీ, మార్కెట్లో రైతులు పొందుతున్న ధరలు చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారిందన్నారు. 2026 మార్చి నెలలో కనిష్ట ధర రూ.1,429లకు, సగటు ధర రూ.1,589 నమోదు అయ్యాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.1,400 నుంచి రూ.1,500లకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ధరలు ఎంఎస్‌పీ కంటే క్వింటాలుకు రూ.700 నుంచి రూ.900 లకు తక్కువగా ఉండటం వలన రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు సుమారు రూ.2 వేల నుంచి రూ.2200 వరకు ఉందన్నారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,400 ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలన్నారు. అకాల వర్షాలకు, గాలివానలకు నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని కోరారు.

శనగ రైతులదీ నష్టాల బాటే..

శనగ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా మారిందని బూచేపల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5,875 లేదన్నారు. వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కంటే ఎక్కువకు రైతులు అమ్ముకొని లాభపడ్డారన్నారు. 2023 మార్కెటింగ్‌ సీజన్‌లో క్వింటాలుకు రూ.8 వేలపైన రైతులు అమ్ముకున్నారు. కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.4,800 నుంచి రూ.5 వేలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే శనగలపై 40 శాతం దిగుమతి సుంకం విధించాలన్నారు. మార్క్‌ఫెడ్‌లో అమ్మకం చేయని రైతులకు క్వింటాకు రూ.1,000 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. గత సంవత్సరం కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ ఉన్న శనగలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.

పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించండి:

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పొగాకు ఉందని బూచేపల్లి అన్నారు. తొమ్మిది పొగాకు వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 30 వేల మంది పొగాకు రైతులు, దాదాపు లక్షకు పైగా కూలీలు ఈ పొగాకు పంటపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఇప్పటికి పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా నిత్యం పొగాకు వేలం జరగడం లేదన్నారు. రోజు మార్చి రోజు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం సాగుతోందన్నారు. కిలో రూ.250 ధరతో ప్రారంభించినట్లు చెప్పారు. పశ్చిమ ఆసియాలోని యుద్ధ ప్రభావం రైతులపై తీవ్రంగా ఉందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్‌కు రూ.200 కోట్లు ఇచ్చి దాదాపు 13 మిలియన్ల పొగాకును కొనుగోలు చేశారని గుర్తు చేశారు. మార్కెట్‌ లో పోటీ వాతావరణం వచ్చి రైతులు లాభాల బాటలో తమ సరుకును అమ్ముకున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ కు నిధులు మంజూరు చేసి వెంటనే మార్కెట్‌లోకి పోటీ వాతావరణాన్ని తీసుకొని రావాలని రైతాంగం డిమాండ్‌ చేస్తోందన్నారు. వరి రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పండించిన ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా రైతులు బయట మార్కెట్‌లో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని తాను కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తానని, పొగాకు వేలం కేంద్రాల్లో కూడా పర్యవేక్షిస్తానని చెప్పారన్నారు.

ప్రభుత్వ చేతకాని తనంవల్లనే రైతులకు నష్టం:

చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లనే జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్జపోతున్నారని బూచేపల్లి మండిపడ్డారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పూనుకొనే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పొగాకు పంటను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. శనగకు దిగుమతి సుంకం విధించి ఆదుకోకపోతే శనగ రైతులు పంట పండించటం ఆపేస్తారన్నారు. ఇక పొగాకుకు వేలం కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించటంతో పాటు పొగాకు బోర్డు ప్రమేయం లేకపోవటంతో వ్యాపారులు పోటీ పడకుండా సిండికేట్‌గా మారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కిలో పొగాకు రూ.210కి పడిపోయేలా తయారు చేస్తున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో బూచేపల్లి వెంట వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి వెంకట సుబ్బారెడ్డి, జిల్లా విభాగం అధ్యక్షుడు మారెళ్ళ బంగారు బాబు, వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నాగులుప్పలపాడు పార్టీ కన్వీనర్‌ శ్రీమన్నారాయణ, ఒంగోలు, దర్శి నియోజకవర్గ పార్టీ నాయకులు, రైతు విభాగాల నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాజాబాబుకు వినతిపత్రం ఇస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, చుండూరి రవిబాబు, బంగారుబాబు

Advertisement
 
Advertisement
Advertisement