ఒంగోలు మెట్రో: ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్ష పరిషత్ వారి ఆధ్వర్యంలో వేద విద్యార్థులకు వేద పరీక్షలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న బ్రాహ్మణ సేవా సమితి శుభప్రదం కమ్యూనిటీ భవనంలో ఉదయం వేద విద్యార్థులు, వేద పండితులు పాల్గొని గణపతి, మేధా దక్షిణామూర్తి, సరస్వతీదేవి పూజా క్రతువులు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని పర్యవేక్షణలో వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు. వేద పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వేద విద్యార్థులను వేద పండితులు సదాశివయ్య వేద సభ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేసి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వేద పండితులు, బ్రాహ్మణ పెద్దల ఆశీర్వచనాలతో వేద పరిషత్ వార్షిక సభా సమావేశాలు ముగిసాయి. కార్యక్రమంలో నగరంలోని బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


