చంద్రబాబు ప్రభుత్వంలో
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ పెట్టారని, కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ద్వారా ఎవరికై నా సహాయం చేస్తున్నారా.? విదేశీ విద్యకు పంపిస్తున్నారా.? అంటే.. అలాంటివేమీ లేవన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అడగరని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో కాపులకు ఆయన ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనీసం డీఎస్పీని మార్చుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కాపు సోదరులందరూ సంఘటితం కావాలన్నారు. తనపై అన్యాయంగా, అక్రమంగా దాడి చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇదేమి న్యాయమని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేవారు లేరన్నారు. తనపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. చంద్రబాబును దూషించానని తనను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జెల్లో ఉంచారని, అయినా భయపడలేదని అన్నారు. తన ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేసిన వారు, తనను దూషించిన వారు, తన కుటుంబాన్ని హింసించిన వారు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లలేదన్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. దీనికి తన, కులం, తన వర్గం స్పందించాలా..లేదా..? అనేది అందరూ ఆలోచించాలన్నారు. అంబటి రాంబాబు అంటే చిన్న వ్యక్తి కాదని, రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకుడని, రాష్ట్రంలో 20 శాతానికిపైగా జనాభా ఉన్న వారికి సంబంధించిన వ్యక్తి అని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. తనను అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సంస్థలు అనేక తప్పుడు కథనాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని వంటి నాయకులు తనపై చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టేందుకు తన సామాజిక వర్గం నిలుస్తుంటే తట్టులోకే మరిన్ని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. దేనికీ అంబటి రాంబాబు భయపడడని, అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న వ్యక్తిని తానని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన బలం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సహకారంతో తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఏ రాజకీయ పార్టీ మనకు మేలు చేస్తుందో కాపు యువత ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు ఎంతో మేలు చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్ సీపీలో కాపుల తరఫున తాను, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కన్నబాబు, తోట త్రిమూర్తులు, గుడివాడ అమర్నాథ్ అందరం కాపులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరని, ఆయనకు ఆ శక్తి లేదని అన్నారు. న్యాయమైన కోర్కెల సాధనకు ప్రభుత్వంపై పోరాడేందుకు కాపు యువత సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
నాడు ముద్రగడ పద్మనాభంపై, నేడు అంబటి రాంబాబుపై దాడులు : బూచేపల్లి
నాడు ముద్రగడ పద్మనాభంపై, నేడు అంబటి రాంబాబుపై చంద్రబాబు ప్రభుత్వం దాడులు చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. కాపు సోదరులందరూ ఆలోచించాలని ఆయన కోరారు. అంబటి రాంబాబుకు జరిగిన అన్యాయంపై నాడు ఒంగోలు పార్లమెంట్ తరఫున వెళ్లి సంఘీభావం తెలిపామని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. ముందుగా అంబటి రాంబాబును శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి చుండూరి రవిబాబు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కాపు యూత్ నాయకులు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కాపు నాయకులు హారిగా మల్లికార్జునరావు, త్రిపురం మల్లికార్జునరావు, తోట బాబి, జిల్లా యువజన విభాగం సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్నకుమార్, ఒంగోలు అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షుడు మల్లిశెట్టి దేవా, రాయని వెంకటరావు, బండి నాగేశ్వరరావు, అమెజాన్ ప్రశాంత్, 37వ డివిజన్ యూత్ అధ్యక్షుడు ఎనుముల సాయి, వేదవ్యాస్ నాయుడు, 38వ డివిజన్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు, 32వ డివిజన్ అధ్యక్షుడు బండారు ప్రభాకర్, 34వ డివిజన్ అధ్యక్షుడు నవీన్, 32వ డివిజన్ యూత్ అధ్యక్షుడు మనోజ్, కాపు నాయకులు పాల్గొన్నారు.
నోరువిప్పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మాజీ మంత్రి అంబటి రాంబాబు
తనను అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు


