చింతలపాలెం టీడీపీలో పైపులైను చిచ్చు | - | Sakshi
Sakshi News home page

చింతలపాలెం టీడీపీలో పైపులైను చిచ్చు

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

జరుగుమల్లి (సింగరాయకొండ): జరుగుమల్లి మండలం చింతలపాలెంలో రక్షిత మంచినీటి పథకం పైపులైను వివాదం ఆ గ్రామంలోని టీడీపీ మద్దతుదారులైన మాజీ ఎంపీపీ బెల్లం వర్గం – మాజీ సర్పంచ్‌ హరిబాబు వర్గం మధ్య చిచ్చు రాజేసింది. రెండు వర్గాల వారూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రి స్వామి మాజీ సర్పంచ్‌ వర్గానికి మద్దతు తెలపడంపై రెండో వర్గం వారు విమర్శిస్తున్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి సమీపంలో ఉన్న పొగాకు బ్యారన్లకు, ఊరు చివరన మద్యం షాపు ఉన్న బీపీఆర్‌ కాంప్లెక్స్‌ వద్దకు రక్షిత మంచినీటి పథకం పైపులైను ఏర్పాటుకు గత సంవత్సరం జూలైలో 15వ ఆర్థిక సంఘం నిధులలో మండల గ్రాంటు కింద రూ.5 లక్షల మంజూరుకు ఎంపీడీఓ రమణమూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఆ ప్రకారం జీఓ కాపీ కూడా ఇచ్చారు. అయితే, సర్పంచ్‌ హరిబాబు పైపులైను ఏర్పాటును వ్యతిరేకించారు. గ్రామంలో ప్రజల కనీస అవసరాలకు ఉపయోగించాల్సిన రక్షిత మంచినీటి పథకం నీటిని వాణిజ్య అవసరాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పంచాయతీ తీర్మానం ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటి నుంచి ఆ గ్రాంటు కింద పనులు జరగలేదు.

ఆదివారం అక్రమంగా పైపులైను ఏర్పాటు...

ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి ప్రత్యేక అధికారుల పాలన రావడంతో బెల్లం వర్గం మళ్లీ పైపులైను వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చి అధికారులపై ఒత్తిడి పెంచింది. దీనిపై పంచాయతీ అభివృద్ధి అధికారి మౌనిక వాణిజ్య అవసరాలకు పైపులైను వేయకూడదని, దీనిపై జిల్లా పంచాయతీ అధికారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఆదివారం సెలవు దినం కావటంతో ఎటువంటి అనుమతులు లేకుండా బెల్లం వర్గీయులు ఆంజనేయస్వామి విగ్రహం సమీపం నుంచి పొగాకు బ్యారన్ల వరకు పైపులైను వేయడంతో పాటు రక్షిత మంచినీటి పథకం పైపులైను నుంచి కనెక్షన్‌ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో సోమవారం ఎంపీడీఓ రమణమూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ కామేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ పౌల్‌రాజ్‌, పంచాయతీ అభివృద్ధి అధికారి మౌనికలు బ్యారన్ల వద్దకు వెళ్లి అక్రమంగా పైపులైను వేసిన బ్యారన్ల నిర్వాహకులను ప్రశ్నించి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్‌ హరిబాబు వర్గానికి మంత్రి స్వామి మద్దతిచ్చారని, పైపులైను తొలగించాలని అధికారులను ఆదేశించారని గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతుండగా, దానిపై రెండో వర్గం వారు విమర్శిస్తున్నారు. సోమవారం ఉదయమే ఈ వ్యవహారం తన దృష్టికి వచ్చిందని గ్రామ ప్రత్యేకాధికారి, కామేపల్లి పశువైద్యాధికారి స్వాతి తెలిపారు. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పైపులైను వివాదంతో అధికారులు ఏం చేస్తారనే దానిపై గ్రామంలో చర్చ నడుస్తోంది. గ్రామంలో పైపులైను వివాదం టీడీపీలోని రెండు వర్గాల మధ్య అగ్గి రాజేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గ్రామంలో పొగాకు బ్యారన్లకు అనధికారికంగా పైపులైను నిర్మాణం

గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పైపులైను వేసిన మాజీ ఎంపీపీ బెల్లం వర్గం

మీ ఇష్టం వచ్చినట్లు పైపులైను ఎలా నిర్మిస్తారన్న మాజీ సర్పంచ్‌ హరిబాబు వర్గం

గత సంవత్సరం పైపులైను ఏర్పాటుకు మండల గ్రాంటు రూ.5 లక్షలు విడుదల చేసిన ఎంపీడీఓ

సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవడంతో పైపులైను వేసిన బెల్లం వర్గం

దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్న మండల, గ్రామ స్థాయి అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement