రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

ఉలవపాడు: ముందు వెళ్తున్న లారీ మలుపు తిరగడంతో దాని వెనుకే వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. అదేవేగంతో మార్జిన్‌లో నిలిపి ఉన్న కారును కూడా ఢీకొట్టింది. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉలవపాడు మండలంలోని మన్నేటికోటరోడ్డు జంక్షన్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. గుంటూరు నుంచి చైన్నెకు పెసల లోడుతో బయలుదేరిన లారీ.. ముందు వెళ్తున్న లారీని వెనుకవైపు ఢీకొట్టింది. అయినప్పటికీ ఆగకుండా ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తూ రోడ్డు మార్జిన్‌లో ఆపి ఉన్న కారును ఢీకొట్టింది. కారుకు హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉండటంతో లారీ పక్కనే కారు నిలబడిపోయింది. ఢీకొట్టిన లారీ నడుపుతున్న తమిళనాడులోని తూతుపూడి మండలం బొమ్మాయపాలేనికి చెందిన డ్రైవర్‌ నాగరాజు (49)కు తీవ్రగాయాలవగా, క్లీనర్‌ పచ్చ పెరుమాళ్లుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మృతిచెందాడు. కారులో ఉన్న ఇద్దరికి, మరో లారీలో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.

ట్రాఫిక్‌ నిలిచి వాహనదారులకు అవస్థలు...

ప్రమాదం కారణంగా రోడ్డుకు అడ్డంగా లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దాదాపు గంట పాటు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పోలీసులు, హైవే సిబ్బంది ఆలస్యంగా రావడంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేవారు లేకుండా పోయారు. స్థానిక పోలీసులు పక్కనే ఉన్న కరేడు ర్యాంపు వద్ద తమ వాహనంలో ఉన్నారు. కానీ సంఘటన స్థలానికి దాదాపు 45 నిమిషాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించకుండా ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ట్రాఫిక్‌లో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ట్రాఫిక్‌ క్లియర్‌ కావడానికి సుమారు 90 నిమిషాలకుపైగా సమయం పట్టింది.

ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి.. ఆ తర్వాత కారును ఢీకొన్న లారీ

జాతీయ రహదారిపై మన్నేటికోట జంక్షన్‌ వద్ద ఘటన

Advertisement
 
Advertisement
Advertisement