కార్యకర్తే రథ సారథి.. | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తే రథ సారథి..

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలకు పెద్దపీట పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత లక్షలాది కార్యకర్తల కోసం బీమా అమలు కూటమిని ఓడించేంత వరకు పోరాటం కొనసాగిద్దాం అమరావతి పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు జగనన్న పాలనలో చేసిన మేలును ప్రజలకు గుర్తు చేయాలి కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు, అవినీతిని ప్రజలకు తెలియజేయాలి లోకేష్‌ చెప్పినట్లు పనిచేసే పోలీసుల దౌర్జన్యాలను ఎదుర్కొంటాం జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మన లక్ష్యం కావాలి వైఎస్సార్‌ సీపీ ప్రచార విభాగం జోన్‌ 4 సమావేశంలో అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, జూపూడి ప్రభాకర్‌, కాకుమాను రాజశేఖర్‌ పిలుపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

పార్టీకి మీరే రథసారథులని, మీరే బలం బలగమని, కూటమి పాలకుల కుట్రలకు వెన్నుచూపకుండా ధైర్యంగా ముందడుగు వేస్తున్న సైనికులకు సలాం చెబుతున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ విభాగం జోన్‌ 4 సమావేశం ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుంచి ప్రచార కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తల కంటే కూడా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడి భరోసా ఇచ్చినవారే నిజమైన పార్టీ కార్యకర్తలని, జగనన్న 2.0 పాలనలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ కేసులతో భయాందోళనకు గురి చేసేందుకు కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. బెదరకుండా నిలబడిన జగనన్న సైన్యం చూపిన తెగువ చరిత్రలో నిలబడిపోతుందన్నారు. కూటమి పాలకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడలేదని, ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయలేదని చెప్పారు. ‘‘నా మీద కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, జైలుకు పంపించారు, ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు, నా భార్యా బిడ్డలను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అయినా నేను చంద్రబాబు ఏడ్చినట్లు ఏడవలేదు. ఒక నాయకుడిగా తిరగబడ్డాను. కూటమిని కూల్చేంత వరకు విశ్రమించేది లేదని’’ అన్నారు. పచ్చపార్టీ కార్యకర్తలు పోలీసుల కళ్ల ఎదుటే నా ఇంటి మీద దాడి చేస్తుంటే చేతిలో లాఠీలు, తుపాకులు ఉన్నా చోద్యం చూస్తూ నిల్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసులను రెచ్చగొట్టి వైఎస్సార్‌ సీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇళ్ల మీదకు పంపిస్తున్నారని, చట్ట ప్రకారం పనిచేస్తే పోలీసులకు సహకరిస్తామని, లేకపోతే ఎదురు తిరుగుతామని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గ పాలనను అంతం పలకడానికి ప్రచార విభాగం కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు.

అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట: చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి

లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఒంగోలు పార్టమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గోబెల్స్‌ ప్రచారాలు చేయడం ద్వారా చంద్రబాబు నాయకుడిగా కొనసాగుతున్నాడన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, ఈవీఎంలు, కూటమి నాయకుల తప్పుడు ప్రచారాలు ఇందుకు కారణాలని చెప్పారు. జగనన్న ఐదేళ్ల పాలనలో కులమతాలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించారని, జగన్‌ పాలనలో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని తెలిపారు.

అభివృద్ధి ప్రదాత జగనన్న: బూచేపల్లి వెంకాయమ్మ

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే సచివాలయాలను ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చర్రితలో జగనన్న ఒక్కడికే దక్కుతుందని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ చెప్పారు. దివంగత మహానేత పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను అమలు చేశారని, జననేత జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మ ఒడి, విద్యా వసతి, మెడికల్‌ కాలేజీలు, నాడు–నేడు వంటి ఎన్నో మంచిపనులు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు. అదే చంద్రబాబు దుర్మార్గాలను పుణికి పుచ్చుకున్న లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రజల మీద, ప్రశ్నించి వారి మీద, వైఎస్పార్‌ సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగనన్న పాలనను తిరిగి తీసుకొని రావడం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు: తాటిపర్తి చంద్రశేఖర్‌

చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఒక్క రేషన్‌ కార్డు మంజూరు చేయలేదని, ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని, గోబెల్స్‌ కనుక బతికి ఉంటే చంద్రబాబు అబద్ధాలకు ఉరేసుకొని చనిపోయే వాడన్నారు. ఆయనకో పాలసీ లేదు, సిద్దాంతం లేదు, కేవలం గెలుపే లక్ష్యంగా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుంటాడన్నారు. మంత్రి నారా లోకేష్‌ అన్నీ శాఖల్లో జోక్యం చేసుకుంటూ సకల శాఖల విఫల మంత్రిగా పేరుతెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుమారుడు కాకపోతే లోకేష్‌ స్థాయి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

జగనన్న చేసిన మేలు గురించి ప్రచారం చేయండి: జూపూడి ప్రభాకర్‌

జగనన్న పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, వాటి గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రచార కమిటీ మీదనే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తపైనా ఉందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ అన్నారు. పార్టీ ప్రజల్లో బలంగా ఉందని, వారిని ఏకోన్ముఖులను చేయడానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆలోచనా విధానాలను అర్థం చేసుకున్న వారికి పదవులు ఇవ్వాలని, పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆలోచనలను కాకుండా పార్టీ విధానాలను ప్రచారం చేయాలని చెప్పారు.

టీడీపీ నాయకులకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేదు: అన్నా రాంబాబు

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోందని, ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. టీడీపీ నాయకులకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేదన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, అందుకే పార్టీ అధికారంలో లేకపోయినా జగనన్న పాలన గురించి కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుతున్నారని చెప్పారు. జగనన్నను గెలిపించేందుకు కృషి చేద్దామన్నారు.

పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి – చుండూరి రవిబాబు

రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు. ప్రచార కమిటీ నాలుగు జిల్లాల జోన్‌4 సమావేశం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యని, అమరావతిలో ఏమీ లేకపోయినా ఏదో ఉందని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 50 ఏళ్ల తరువాత ఏదో జరుగుతుందని, ఇప్పుడు భూతద్దంలో చూపుతున్నారన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాల గురించి అప్పటికి అడిగేవారుండరని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో కంటే మోసం చేయడంలోనే అనుభవం ఉందన్నారు.

నూరు శాతం హామీలు నెరవేర్చాం: కుందురు నాగార్జున రెడ్డి

జగనన్న పాలనలో నూరు శాతం హామీలు నెరవేర్చామని, నాడు చేసిన పనులతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసం గురించి ప్రచార విభాగం విస్తృతంగా ప్రచారం చేయాలని గిద్దలూరు ఇన్‌చార్జి కుందురు నాగార్జున రెడ్డి కోరారు. సచివాలయాలు, విలేజి క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలతో జగనన్న సమసమాజం కోసం పనిచేశారని, ఆయన చేసిన పనులను సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో పార్టీకే కాకుండా ప్రజలకు, రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు చేర్చాలి: దద్దాల నారాయణ యాదవ్‌

చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్నీ విధాలుగా వైఫల్యం చెందారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడని కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమంగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పారు. ప్రచార కమిటీతో పాటుగా పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు వైఫల్యాల గురించి, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం గురించి ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా నిలబడితే విజయం సాధిస్తామన్నారు.

నమ్మకం పెంచిన ప్రచార కమిటీ సమావేశం: బత్తుల బ్రహ్మానందరెడ్డి

పార్టీ ప్రచార కమిటీ సమాశంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమన్న నమ్మకం పెరుగుతుందని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రజలకు చేసిన మేలు చెప్పుకోలేకపోవడం వలన పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. పదవులు ఇచ్చిన వారికి పార్టీపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: కాకుమాను రాజశేఖర్‌

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా ప్రచారం విభాగం కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ అన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రజలకు ఎన్నో పథకాలు అందించినా ప్రజలకు చెప్పుకోలేకపోవడం వల్లనే ఓటమి చెందామన్నారు. 2029 ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. కూటమి పాలన వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజల సమస్యలను గొంతెత్తి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని చెప్పారు. ఈ విషయాలను ప్రజల వద్దకు చేర్చాలన్నారు. సమావేశం ప్రారంభం వరకు విద్యుత్‌ బాగానే ఉన్నా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తరువాత మాటిమాటికీ కరెంటు కట్‌ అయింది. ప్రతి పది నిముషాలకోసారి కరెంటు పోయింది. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు కేసులు పెట్టించడం గురించే తెలుసనుకున్నాను ఇలా ఫీజులు తీయించడం కూడా తెలుసని ఇప్పుడే తెలిసిందంటూ వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమణా రెడ్డి, వైవీ వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్‌, ప్రచార కమిటీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ దువ్వూరి మునిశేఖర రెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు ఉమావల్లి యాదవ్‌, చిత్తూరు జిల్లా విభాగం అధ్యక్షుడు రమణా రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బి.నరసింహా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ జిలాని, నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మిశెట్టి కిషోర్‌, నగర కమిటీ అధ్యక్షుడు పిగిలి శ్రీనివాసరావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement