ఉలవపాడు: మండల పరిధిలోని పెదపట్టపుపాలెం గ్రామంలో ఈ నెల 22న సమావేశం నిర్వహించాలని మత్స్యకారులు నిర్ణయించారు. రామాయపట్నం రిసార్ట్స్ సమీపంలో వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులు ఈ సమావేశంలో పాల్గొనాలని వారు ఆమేరకు నిర్ణయించారు. జువ్వలదిన్నె హార్బర్ వద్ద బోట్ల తరలింపు వ్యవహారానికి సంబంధించి పాకల వద్ద జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడానికి మళ్లీ పెదపట్టపుపాలెంలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది మత్స్యకారులు హాజరయ్యారు.
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి ఎలుగుబంటి సంచారం యాత్రికులను భయాందోళలకు గురి చేసింది. శ్రీశైలం రహదారిలోని చిన్నారుట్ల సమీపంలో ప్రసిద్ధిగాంచిన అభయాంజనేయస్వామి ఆలయం ఉంది. ఆదివారం రాత్రి సమయంలో ఎలుగుబంటి ఆలయంలోనికి వెళ్లి రావటాన్ని కొందరు భక్తులు వీడియోలు తీయటంతో అవి షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాత్రి పూట ద్విచక్ర వాహనాలపై పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో వన్యప్రాణులు అటవీ ప్రాంతంలోని రోడ్లపై సంచరిస్తుంటాయని, యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రజలు సంతృప్తి చెందేలా మీకోసం అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజల్లో విశ్వాసం నింపేలా, వారిలో సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఎండ బారిన పడకుండా మీకోసం కార్యక్రమ నిర్వహణ సమయాన్ని కలెక్టర్ మార్చారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. అర్జీదారులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బసవన్నకు ఘన నివాళి
మహాత్మా బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అభ్యుదయవాది బసవన్న అందరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ. బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, విజయజ్యోతి, మాధురి, కళావతి, డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


