కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టి వేధించారని, దాడులు చేసి హింసించారని, అయినా సరే లెక్క చేయకుండా జగనన్న వెంట నడిచిన కార్యకర్తలకు సలాం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటుగా ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. పార్టీలో ప్రచార కమిటీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ప్రచార కమిటీకి సహకరించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయకుండా కూటమి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల మీద విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోమని చెప్పారు.


