కందుకూరు రూరల్: పొలాల్లోకి మేతకు వెళ్లిన పశువుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం నిధులతో పశువులకు నీటి తొట్లు నిర్మించింది. గతేడాది పశువుల దాహార్తి తీర్చడంతో పాటు స్వచ్ఛమైన నీటిని వాటికి అందించేందుకు జిల్లా అధికారులు టార్గెట్లు ఇచ్చి మరీ పశువుల తొట్లు నిర్మించారు. వేల రూపాయలు వెచ్చించి తొట్లు నిర్మించినప్పటికీ వాటిని ఉపయోగించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది, మరికొన్ని పంచాయతీల్లో పంచాయతీ అధికారులు బాధ్యత వహించి నిర్మించిన తొట్లలో నీరు నింపాల్సి ఉంది. కానీ పశువుల తొట్లలో ఎవరూ నీరు నింపకపోవడంతో అవి అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.
అనువైన ప్రాంతాల్లో నిర్మించినా
నిరుపయోగం...
కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. మండలాల వారీగా పంచాయతీల్లో నీటి తొట్ల నిర్మాణానికి గతేడాది 151 తొట్లు మంజూరు చేశారు. వాటిలో గుడ్లూరు మండలానికి 35 తొట్లు, కందుకూరు 29, లింగసముద్రం 40, ఉలవపాడు 14, వలేటివారిపాలెం 33 చొప్పున నీటి తొట్లు మంజూరు చేశారు. ఒక్కొక్క తొట్టి నిర్మాణానికి సైజులను బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నిధులు కేటాయించారు. అయితే, వాటిని మెటీరియల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా పంచాయతీల్లో కూటమి నాయకులు నిర్మించారు. గ్రామ శివార్లలో పశువులు మేతకు వెళ్లే ప్రాంతాల్లో నీటి తోట్లు నిర్మించారు. ఇలా గుడ్లూరు మండలంలో 11, కందుకూరు 12, లింగసముద్రం 26, ఉలవపాడు 8, వలేటివారిపాలెం మండలంలో 22 పశువుల నీటి తొట్ల నిర్మాణం పూర్తి చేశారు. పైపులైన్లు ఉన్న చోట మాత్రమే తొట్లు నిర్మించారు. నీటిని నింపేందుకు అనువైన ప్రాంతాలనే ఎంచుకుని తొట్లు నిర్మించినప్పటికీ నీరు మాత్రం నింపకుండా నిరుపయోగంగా వదిలేశారు.
ఆదేశాలు పెడచెవిన పెట్టడంతో తొట్లు ఖాళీ...
నిర్మించిన పశువుల నీటి తోట్లను ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు ఆయా పంచాయతీలకు అప్పగించాలి. ఆ తర్వాత తొట్లకు నీటిని నింపే బాధ్యత పంచాయతీ అధికారులు తీసుకోవాలి. కానీ, కందుకూరు పంచాయతీకి కొన్ని అప్పగించినప్పటికీ మరికొన్ని పంచాయతీల్లో అప్పగించలేదు. ఇలా పంచాయతీలకు అప్పగించిన గ్రామాల్లో పంచాయతీ అధికారులు, అప్పగించని గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది తొట్లకు నీటిని నింపాలని జిల్లా అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ, ఆయా ఆదేశాలు పెడచెవిన పెట్టడంతో తొట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
అల్లాడుతున్న మూగజీవాలు...
ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండలకు పశుపోషకులు తమ పశువులను మేపుకునేందుకు పొలాలకు తోలుకెళ్తున్నారు. అలాంటప్పుడు పశువుల తాగునీటికి ఇబ్బంది లేకుండా తొట్లలో నీరు నింపితే ఎంతో ఉపయోగపడేవి. ఎండలకు పశువులకు దాహం వేస్తే ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండే కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతుంటాయి. అలాంటి రోగాలను నివారించేందుకు కూడా పశువుల నీటి తొట్లు ఉపయోగకరంగా ఉండేవి. కానీ, వాటికి నీరు నింపకపోవడంతో మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు దాహంతో అలమటిస్తున్నాయి. వేల రూపాయలు వెచ్చించి పశువుల నీటి తొట్లు నిర్మించినప్పటికీ వాటిలో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారడాన్ని పశుపోషకులు విమర్శిస్తున్నారు.
అధికారులు విఫలం...
పశుగణన ప్రకారం నీటి తొట్లు నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారు. మంజూరు చేసిన తొట్లను నిర్మించడానికి కూడా అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. మెటీరియల్ కాంట్రాక్ట్ అయినప్పటికీ కేటాయించిన నిధులు సరిపోవని, నిర్మించినా సకాలంలో బిల్లులు రావని అరకొరగానే నిర్మించారు. కందుకూరు నియోజకవర్గానికి 151 మంజూరైతే.. నిర్మించింది మాత్రం 79 కావడమే అందుకు నిదర్శనంగా ఉంది. పశుగణన ప్రకారం తొట్ల నిర్మాణం జరగలేదని పశుపోషకులు పెదవి విరుస్తున్నారు.
మదన గోపాలపురంలో నీరు లేని తొట్టి
నీరు లేక చెత్తాచెదారంతో ఉన్న పశువుల నీటి తొట్టి
ఎండిపోయిన పశువుల నీటి తొట్లు
తొట్లు నిర్మించి నీళ్లు నింపడం మరిచిన అధికారులు, పాలకులు
నిరుపయోగంగా పశువుల నీటి తొట్లు
బిల్లులు చేసుకోవడం మినహా ప్రయోజనం శూన్యం
వేసవి ఎండలకు దాహంతో అల్లాడుతున్న మూగజీవాలు
పట్టించుకోని ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీ అధికారులు
కందుకూరు నియోజకవర్గంలో 151 తొట్లు మంజూరవగా 79 నిర్మాణం
కందుకూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పశుగణన వివరాలు...
మండలం పేరు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు
కందుకూరు 586 17,287 23,312 6,902
ఉలవపాడు 544 15,833 38,709 15,419
గుడ్లూరు 1,283 21,000 41,964 9,884
వలేటివారిపాలె 497 14,234 31,197 8,080
లింగసముద్రం 472 15,989 32,493 7,945
మొత్తం 3,382 84,343 1,67,675 48,230


