● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
త్రిపురాంతకం:
రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ అనేవి టీడీపీ నాయకుల్లో తప్ప.. ప్రజల్లో కనిపించడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందక పేద ప్రజల్లో ఆనందం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపురాంతకం మండలం మేడపిలో శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి తిరునాళ్లలో శనివారం రాత్రి విద్యుత్ ప్రభపై ఎమ్మెల్యే తాటిపర్తి మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ మంజూరు కాలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందించిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రజలకు సమాధానం చెప్పేవారు లేదన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓట్ల కోసం అనేక రకాల హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని, గెలిచిన తర్వాత మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి అంకితభావంతో కృషిచేయాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అక్రమ కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు శాసం రంగబాబు, ఆళ్ల కృష్ణారెడ్డి, గుమ్మ శ్రీను, గుర్రం బాబూరావు, నల్లూరి నాగేశ్వరరావు, గుమ్మా హనుమయ్య, మురారి గాలెయ్య, సరళకుమారి తదితరులు పాల్గొన్నారు.


