● స్వామివారి ఆభరణాలు, హుండీ నగదుఎత్తుకెళ్లిన దుండగులు
పొదిలి రూరల్: మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ గోగినేనివారిపాలెంలో శనివారం రాత్రి గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి అమ్మవారి ఆభరణాలు, హుండీ దొంగిలించారు. ఆదివారం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన గ్రామస్తులు చూసి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. పొదిలి సీఐ రాజేష్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలేరమ్మ ఆలయానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరకు హుండీ తీసుకెళ్లి అందులో ఉన్న స్వామివారి వెండి కిరీటంతో పాటు ముక్కుపుడక, నగదు ఎత్తుకెళ్లారు. సీఐ రాజేష్ మాట్లాడుతూ దొంగిలించబడిన ఆభరణాల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. లక్షలాది రూపాయలతో ఆలయం నిర్మించి కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం వలన దొంగలను సులభంగా గుర్తించే అవకాశం లేకుండా పోతోందన్నారు. అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


