ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు లేని 12 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే 17 మంది ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జీవో నంబర్–1 ప్రకారం మిగులుగా ఉన్న 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సీనియార్టీ జాబితా రూపొందించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. 40 ఎయిడెడ్ ఏకోపాధ్యాయులు సెలవు పెడితే ఆ పాఠశాలలకు ఎంఈఓలు సీఆర్‌ఎంటీలను కేటాయించాలన్నారు. కారుణ్య నియామకానికి అర్హులైన ఎయిడెడ్ కుటుంబ సభ్యుల జాబితాను కమిషనర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి సీనియార్టీ జాబితా రూపొందించాలని, లేకుంటే 25వ తేదీ డీఈఓ కార్యాలయం ముందు నిరాహారదీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ వర్గీయులకు ఆదివారం పోలీసులు నోటీసులు అందజేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూప్‌లలో పోస్ట్ చేసిన ఐటీడీపీ కార్యకర్తను ప్రశ్నించారని ఆ కార్యకర్త కేసు పెట్టడంతో పోలీసులు వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, సోషల్ మీడియా కార్యకర్త లక్ష్మిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు చిట్టే వెంకటేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ మేరకు వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో 35క్లాస్3 నోటీసులు అందుకున్నారు.


