బల్లికురవ: చరిత్ర కలిగిన దొడ్డి కొండకు ఆకతాయిలు ఆదివారం సాయంత్రం నిప్పంటించటంతో పచ్చదనాన్నిచ్చే చెట్లు కాలిపోతున్నాయి. బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం, ఎస్‌ఎల్ గుడిపాడు, వైదన రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 200 ఎకరాల్లో దొడ్డికొండ విస్తరించి ఉంది. ఈ కొండ పైభాగంలో 12వ శతాబ్దం చోళరాజులు శివాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణమైతే పూర్తయిందిగానీ విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. అయినప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు వివిధ గ్రామాల ప్రజలు చారిత్రక ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ కొండను అభివృద్ధి చయాలని మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ కొండకు తూర్పు భాగంలో ముక్తేశ్వరంవైపు నిప్పంటించటంతో మంటలు వ్యాపిస్తున్నాయి. చెట్లతో పాటు అనేక మూగజీవాలు కాలి బూడిదవుతున్నాయని, భవిష్యత్తులో ఆకతాయిలు ఇలా నిప్పంటించకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పచ్చదనమిచ్చే చెట్లతో పాటు కాలిపోతున్న మూగజీవాలు
ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని 5 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి


