విగ్రహం చుట్టూ ఫెన్సింగ్, ప్లాట్‌ఫాం ధ్వంసం చేసిన టీడీపీ నాయకుడు
ఒంగోలు టౌన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూల్చేందుకు ఒక టీడీపీ సీనియర్ నాయకుడు కుట్రలకు పాల్పడుతున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలోని బస్టాండు సెంటర్లో 15 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని కూల్చేయాలని స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు కుట్రలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నాడు. వైఎస్సార్ జయంతి, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నాడు. రెండు నెలల క్రితం విగ్రహం సమీపంలో తన పాత ఇంటిని పునర్నిర్మించడం మొదలుపెట్టాడు. తన ఇంటికి అడ్డుగా ఉందన్న సాకు చూపుతూ వారం క్రితం గుట్టుచప్పుడు కాకుండా విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, ప్లాట్‌ఫాంను ధ్వంసం చేశాడు. ఇదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


