పసికందుల ప్రాణాలకు రేటు
ప్రమాదాల అనంతరం సెటిల్మెంట్లకు దిగుతున్న టీడీపీ నేతలు
యర్రగొండపాలెం:
పసికందుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన పాలకులు.. నీట మునిగి మృతి చెందిన వారికి నిస్సిగ్గుగా వెల కడుతున్నారు. బడా నాయకులు చెప్పే మాటలు జవదాటితే మనుగడ కష్టమవుతుందన్న భయంతో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు తలూపక తప్పడం లేదు.! తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆశలు పెట్టుకొని చిన్నారులను బడికి పంపుతుంటే అక్కడ అఆలు తప్ప జాగ్రత్తల గురించి చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ఎక్కడో బోరు గుంతలోపడి చిన్నారి మృత్యువాత పడిందని, ప్రాణాలతో బయటకు తీసుకొని వచ్చారనే విషయాల గురించి ప్రసార మాధ్యమాలు పెద్దగా లేని రోజుల్లోనే జనానికి ఎక్కువగా తెలిసేది. వెను వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామీణ ప్రాంతాలు, పొలాల్లో ఫెయిలైన బోరు గుంతలను పూడ్పించే ఏర్పాట్లు ముమ్మరంగా చేసేవారు. ప్రస్తుతం బోరుగుంతల వద్ద ప్రమాద పరిస్థితులు అంతగా లేవు కానీ, నీటి కుంటల వద్ద తరచూ సంభవిస్తున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు.
‘శవాలపై చిల్లర’ రాజకీయాలు!
ఏటా నీటి కుంటల్లో పసిమొగ్గలు రాలిపోతూనే ఉన్నాయి. తాజాగా యర్రగొండపాలెం మండలంలోని చిన్నబోయలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్, బోయలపల్లి దీపన్ అరటి తోటలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లి కాళ్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో జారి పడి మృత్యువాత పడ్డారు. దాదాపు ఏడాది క్రితం స్థానిక మార్కాపురం రోడ్డులోని వై.కొత్తపల్లి సమీపంలో తాగేందుకు నీళ్లు తెచ్చుకోవడానికి కుంట వద్దకు వెళ్లిన ఒక కూలీ అందులో పడి ప్రాణాలు వదిలాడు. గుర్తుతెలియని మరొక వ్యక్తి బహిర్భూమికి వెళ్లి అక్కడ ఉన్న నీటి కుంటలో జారిపడి మృతి చెందాడు. గత ఏడాది మార్చి నెలలో పెద్దదోర్నాల మండలంలోని బలిజేపల్లి క్వారీల్లో తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన చిన్నగుడిపాడు చెరువులో మట్టి కోసం తీసిన గుంతలో పడి ఇంటర్ చదువుతున్న పులుకూరి అద్భుత కుమార్, 4వ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ చనిపోయారు. పెద్దారవీడు మండలంలోని కొత్తపల్లిలో సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం బడి లేకపోవడంతో ముగ్గురు చిన్నారులు ఆరవీటి ఏడుకొండలు, కొత్తపలి మను, కొత్తపల్లి శివలు ఆడుకోవటానికి కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనల తర్వాత కొందరు నాయకులు పోలీసుల ఎదుటే పంచాయితీలు పెట్టి పిల్లల ప్రాణాలకు వెలకట్టి చేతులు దులుపుకొంటున్న తీరు చర్చనీయాంశమైంది. నీటి కుంటల వద్ద రక్షణ కల్పించని వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి గ్రామాలకు సమీపంలో ఉన్న నీటి కుంటలకు ఫెన్షింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డ్రౌనింగ్(నీట మునిగి చనిపోవడం) కేసులు నమోదు కాకుండా ఉమ్మడి ప్రకాశం ఎస్పీలుగా విధులు నిర్వర్తించిన సిద్ధార్థ్ కౌశల్, మలికాగర్గ్ తదితరులు చర్యలు చేపట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా డ్రౌనింగ్ మరణాలను నిలువరించగలిగారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో డ్రౌనింగ్ మరణాలను అడ్డుకునేలా పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులను వేధించడానికి పోలీసులను ఉసిగొల్పుతున్న తీరు చర్చనీయాంశమైంది.
ఫారం పాండ్లకు రక్షణ కంచెలేవి?
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్న నినాదంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్(పస్తుతం వీబీ జీ రామ్ జీ), ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పొలాల్లో ఫారం పాండ్లు తవ్వేస్తున్నారు. అయితే వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆ దిశగా రైతులకు కనీస అవగాహన కల్పించడం లేదు. గ్రామాలకు దగ్గరగా ఉన్న నీటి కుంటల్లో పిల్లలు మునిగిపోవడం, అడవులు, కొండ ప్రాంతాల్లో వన్యప్రాణులు నీరు తాగేందుకు వెళ్లి ఆ గుంతల్లో పడిపోవడం లాంటి సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. చిన్నారులకు అవగాహన లేకపోవడం వల్ల సరదా కోసం నీటి కుంటల వద్దకు వెళ్లి మృత్యు కోరల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు.


