23 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

23 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

23 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు గుండ్లకమ్మలో పడి వ్యక్తి మృతి ఉరివేసుకుని ఒకరు ఆత్మహత్య వినాయకస్వామి దేవాలయంలో చోరీ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి

ఒంగోలు టౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడుతున్న 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించిన ఒంగోలు ట్రాఫిక్‌ పోలీసులు.. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారిలో 20 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. ముగ్గురికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సీఐ జగదీష్‌ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు.

నాగులుప్పలపాడు: మండలంలోని వినోదరాయనిపాలెం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నదిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగులుప్పలపాడు ఎస్సై మహేంద్రనాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. గుండ్లకమ్మ నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెళ్లి పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన బిడ్డిక చినరాయుడు (34)గా గుర్తించారు. వినోదరాయనిపాలెం రొయ్యల చెరువుల వద్ద కాపలాదారుడిగా నాలుగు రోజుల క్రితం చేరాడని, మతిస్థిమితం సరిగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడని, ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో పడి మృతిచెందాడని తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

కొండపి: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కొండపి మండలంలోని పెరిదేపి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెరిదేపి గ్రామానికి చెందిన కొండలరావు(45) గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం భార్య కూలీ పనులకు, కుమార్తె పాఠశాలకు వెళ్లింది. మనసులో బాధతో కుంగిపోయిన కొండలరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సహాయంతో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య తలుపు తెరిచి చూడగా భర్త ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్యాగరాజు తెలిపారు.

ఒంగోలు టౌన్‌: నగరంలో ప్రసిద్ది చెందిన వరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో దొంగలు పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని సీతారామపురంలో శ్రీగిరి వెళ్లే మార్గంలో జాయింట్‌ కలెక్టర్‌ గృహానికి కూతవేటు దూరంలో ఉన్న వరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం దొంగలు పడ్డారు. సుమారు ఒకటిన్నర లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయ హుండీ పగులగొట్టి అందులో ఉన్న నగదు తీసుకెళ్లారు. దేవాలయ సమీపంలో ఉన్న వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో కూడా దోపిడీకి ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం రూరల్‌: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయ సునీత పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో గ్రీన్‌ అంబాసిడర్లు రోజూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేయడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పన్నుల రాబడి తక్కువగా రావడంపై ఆరా తీశారు. గ్రామ స్థాయిలో పారిశుధ్య నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఎంపీడీఓ బాల చెన్నయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement