న్యాయం కోరితే దాడి చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోరితే దాడి చేస్తారా?

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

అద్దంకి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, నూర్‌బాషా సంఘం రాష్ట్ర నాయకుడు కొటికలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై శశుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తోరోకో దాదాపు గంటన్నరపాటు కొనసాగింది. వివరాలు.. మండలంలోని చక్రాయపాలెం వద్ద గురువారం బైక్‌ను కారు ఢీకొట్టడంతో అద్దంకి పట్టణానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు కొటికలపూడి శ్రీను, మరో వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే. అయితే పోస్టుమార్టం నిర్వహించడం కోసం సంతకాలు చేయాలని మృతుడి బంధువులను పోలీసులు అడిగారు. తమకు న్యాయం జరగనిదే సంతకాలు చేయమని వారు తేల్చిచెప్పారు. ప్రమాదం సమయంలో కారు నడిపిన వ్యక్తిని కాకుండా వేరొకరిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని ఆరోపించారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతుని బంధువుల్లో కొందరిపై సీఐ సుబ్బరాజు చేయి చేసుకోవడంతో వివాదం ముదిరింది. పోలీసులు న్యాయం చేయరని భావించిన మృతుడి బంధువులు సుమారు 200 మంది, మృతుని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై అద్దంకి భవానీ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతుడి బంధువులను ఆస్పత్రి వద్ద ఎందుకు కొట్టారని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఎదుట సీఐని నిలదీశారు.

డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ

బాధితులు, ప్రమాదానికి కారణమైన వారితో చర్చించిన అనంతరం నష్టపరిహారం ఇప్పించేందుకు డీఎస్పీ ఒప్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మృతదేహాన్ని బంధువులు ఇంటికి తరలించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొటికలపూడి శ్రీను కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement