రాచర్ల: మండలంలోని జేపీ చెరువులో పవిత్ర క్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జేపీ చెరువు గ్రామంలో 16 రోజుల పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయి రెండు పండ్ల విభాగ ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ బండలాగుడు పోటీల్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం ద్వార్షల వెంకటసాయిభవత్ చెందిన ఎడ్లజతలు నిర్ణీత 15 నిమిషాల్లో 3342 అడుగులు లాగి మొదటి బహుమతిని సాధించాయి. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కమలాపురం గ్రామానికి చెందిన రమణారెడ్డి ఎడ్లజతలు 3282 అడుగులు లాగి రెండవ బహుమతి గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా నల్లగుండ్లకు చెందిన రవి ఎడ్లజతలు 2950 అడుగులు లాగి మూడో బహుమతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లెకు చెందిన బాలరామ్ ఎడ్లజతలు 2930 అడుగులు లాగి నాల్గవ బహుమతి, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం దొర్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి ఎడ్లజతలు 2896 అడుగులు లాగి ఐదో బహుమతి, మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రేత్వికారెడ్డి ఎడ్లజతలు 2747 అడుగులు లాగి ఆరో బహుమతి సాధించాయి. విజేతలకు మొదటి నుంచి 6 బహుమతులు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు.


