● సబ్‌జైల్లో ఖైదీలకు మేజిస్ట్రేట్ బాలాజీ సూచన
మార్కాపురం: మంచి చెడును గ్రహించే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారని మార్కాపురం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం మార్కాపురం సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండాలని, అవి లేనప్పుడే సమాజంలో అశాంతి నెలకొని నేరాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నిగ్రహం నశించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది చెడు అలవాట్లను వీడి పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఆయన వెంట సబ్‌జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు ఉన్నారు.


