● నిందితుడిని అదుపులోకి తీసుకున్న తాలుకా పోలీసులు
ఒంగోలు టౌన్: పగటి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఒంగోలు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తాలుకా పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ టి.విజయకృష్ణ నిందితుడి వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని లంకెలకూరపాడు గ్రామానికి చెందిన మల్లిరెడ్డి నరేంద్రరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రకాశం జిల్లాతోపాటు పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒంగోలు నగరంలోని వెంకటేశ్వరనగర్‌లో గల టీచర్స్ కాలనీలో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టగా నరేంద్రరెడ్డి నిందితుడని తేలింది. నగరంలోని మంగమ్మ కాలేజీ సమీపంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్సై హరిబాబు తమ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 66 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. టీచర్స్ కాలనీలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నరసారావుపేటలోని ఒక ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టిన రసీదులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తాలుకా పరిధిలో రెండు నేరాలు, గుడివాడ, నరసరావుపేట రూరల్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


