మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మర్రిపూడి ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి పరామర్శ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కనిగిరి రూరల్: కూటమి పాలనలో నాయకుల అరాచకాలు, పోలీసుల దౌర్జన్య కాండలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం గార్లపేట పంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన భువనం ప్రసాద్ మర్రిపూడి ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించి కనిగిరి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా బాధితుడిని ఆదిమూలపు సురేష్ కనిగిరిలోని వైద్యశాలకు వచ్చి పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూటమి నాయకులకు పోలీసులు ఏకపక్షంగా వత్తాసు పలుకుతూ బడుగు, బలహీనవర్గాలను అణిచివేస్తున్న ఘటనలకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. భువనం ప్రసాద్ ఆరేళ్ల క్రితం ఓ టీడీపీ నాయకుడికి రూ.2.50 లక్షల బాకీ ఉన్నాడని, వాటిని తీర్చాలని పోలీసులు ఆరేళ్ల నాటి కేసును తవ్వి తీసి గత 15 రోజుల నుంచి ప్రసాద్ కుటుంబ సభ్యులు, బావమరిదిని పదేపదే స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు హింసించారన్నారు. అయితే ప్రసాద్ కుటుంబ సభ్యులు తాము బాకీ ఎప్పుడో తీర్చివేశామని ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు ఆరేళ్ల తరువాత దీని గురించి విచారణ చేయడం ఏమిటని, అయినా ఇది సివిల్ మ్యాటరని ఏదైనా ఉంటే కోర్టుకు పెట్టాలని మీరు ఈవిధంగా బాధించడం సరికాదని ప్రసాద్ ఎస్సైకి విన్నవించాడన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రతిరోజు స్టేషన్‌కు పిలిపించి సాయంత్రం వరకు ఉంచి రాత్రికి పంపడం అవమాన కరమని ఇంటివద్ద చిన్నపిల్లలతో భార్య ఉందని కాళ్లావేళ్లా పడ్డా ఎస్సై కనికరం చూపలేదన్నారు. మర్రిపూడి ఎస్సై కొండపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమమంత్రి ప్రోద్బలంతోనే ఇది చేస్తున్నారని, మంత్రిని ప్రసన్నంచేసుకునేందుకు, పోస్టును కాపాడుకునేందుకే భువనం ప్రసాదును 15 రోజులపాటు స్టేషన్ చుట్టూ తిప్పించుకుని..ఈనెల 15వ తేదీ రాత్రి బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టాడన్నారు. అవమాన భారంతో భువనం ప్రసాద్ పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అది మరిచిపోయి మంత్రులు చెబితేనో, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబితేనో దౌర్జన్యంగా వ్యవహరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రాణాలు తీసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తక్షణం దీనిపై ఎస్పీ విచారణ జరిపించి బాధ్యులపై, మర్రిపూడి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలను దళితులను హౌస్ అరెస్ట్ చేసి, తహసీల్దార్‌ను తీసుకొచ్చి దౌర్జన్యంగా ప్రారంభించడం హేయమన్నారు. కేవలం ఎస్సై, పోలీసుల అండతోనే ఈ పని చేశారన్నారు. తక్షణం ఎస్పీ, ఆర్డీఓ విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేయాలన్నారు.
తీరుమారకపోతే న్యాయపోరాటం:
అధికారులు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలన్నారు. తీరుమారకపోతే న్యాయస్థానం తలుపు తడతామని, జ్యుడీషియల్ ఎంకై ్వరీ చేయిస్తామని, బాధితులకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం.ప్రసాదరెడ్డి, మున్సిపాల్ మాజీ చైర్మన్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఎస్.మోహన్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుప గోవర్ధన్‌రెడ్డి, పీసీపల్లి మండల కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, ఆర్.మాణిక్యరావు, మర్రిపూడి మండల కన్వీనర్ ఇంకొల్లు సుబ్బారెడ్డి, మాజీ మండల కన్వీనర్ బోధా రమణారెడ్డి, ఎంపీటీసీ కొండారెడ్డి, బిందు నరసింహ, గూడూరి అబ్రహంలికన్, వేశపోగు గురుప్రసాద్, డాక్టర్ షేక్.నాయబ్‌రసూల్, ఆవుల క్రిష్ణారెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, కంటు గురవయ్య, షేక్.జిలాని, ఖాసీంవలి, దేవరాజ్, భాస్కర్ పలువురు పాల్గొన్నారు.


