నకిలీ డాక్యుమెంట్లతో వంద మందికి చెందిన స్థలాల కబ్జాకు యత్నం హద్దురాళ్లను జేసీబీతో తొలగించిన కబ్జాదారులు కలెక్టరుకు ఫిర్యాదు చేసిన బాధితులు బాధితులతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రే నకిలీ డాక్యుమెంట్లు పుట్టిస్తూ స్థలాలు తమవేనంటూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత డిసెంబరులో మార్కాపురం జిల్లాగా ఏర్పాటు కావడంతో స్థలాల ధరలకు రెక్కలు రావడంతో భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్రమ మార్గాల్లో రెచ్చిపోతున్నారు. మార్కాపురం కలెక్టరేట్‌కు అర కిలోమీటరు దూరంలో సుమారు 100 మందికి చెందిన ఇళ్ల స్థలాలను కొంతమంది జేసీబీతో చదునుచేసి హద్దురాళ్లను తొలగించడం సంచలనం రేపుతోంది. రెండు రోజుల నుంచి బాధితులందరూ ఆందోళన చెందుతున్నారు. గురువారం కలెక్టరును కలిసి తాము 2010లో కొనుగోలు చేసిన స్థలాలను గిద్దలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది కబ్జా చేశారని వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. మార్కాపురం, తర్లుపాడు రోడ్డులోని అల్లూరి పోలేరమ్మ గుడి వెనుక 12 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 100 మందికి పైగా స్థలాలు కొనుగోలు చేశారు. 2005, 2010 మధ్య ఈ స్థలాలను కొనుగోలు చేసినట్లు స్థలం యజమానులు తెలిపారు. ఇటీవల వారం క్రితం గిద్దలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు మార్కాపురం అల్లూరి పోలేరమ్మ గుడి వద్దకు వచ్చి సుమారు 100 మందికి చెందిన స్థలాలపై దృష్టిసారించి జేసీబీలు తెచ్చి భూమిని చదునుచేయించడంతో పాటు హద్దురాళ్లను తొలగించి భూమి తమదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా భూకబ్జాదారుల వ్యవహారం బయటపడింది. స్థలం యజమానులు కబ్జాదారుల పేర్లు బయటపెట్టేందుకు సాహసించడం లేదు. కలెక్టరుకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్‌గా 100 మందికి చెందిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.
బాధితులతో మాట్లాడిన అన్నా రాంబాబు:
సమాచారం తెలుసుకున్న మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం తమ స్థలాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న యజమానుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టబద్ధంగా ఉన్న స్థలాలపై ఆందోళన చెందవద్దని వారికి భరోసా కల్పించారు. న్యాయబద్ధంగా ముందుకు సాగాలని, అవసరమైతే తాను మాట్లాడతానని అన్నా రాంబాబు భరోసా ఇచ్చారు. అన్నా రాంబాబు వెంట పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సలీమ్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. కాగా జనసేన ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్ కూడా బాధితులతో మాట్లాడారు.


