మర్రిపూడి: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పీ రాజాబాబు మండలంలోని గుండ్లసముద్రంలో శుక్రవారం రాత్రి బసచేశారు. ఈ సందర్భంగా గుండ్లసముద్రం పంచాయతీ పరిధిలోని కొష్టాపల్లి, ఎస్టీరాజుపాలెం గ్రామస్తులతోపాటు మండలంలోని పలుగ్రామాల ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. మర్రిపూడి, గుండ్లసముద్రం గ్రామాల్లోని చెరువులకు పొదిలి చిన్న చెరువు నుంచి సాగు, తాగునీరు అందిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు సైతం అర్జీ రూపంలో తెలియజేశామని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి కలెక్టర్ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మండలవాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, వేసవిలో తాగునీరు అందించాలని సొసైటీ అధ్యక్షుడు ఎర్రమోతు శ్రీనివాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబరు 571లో దాదాపు 206 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందని, అయితే ఆ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఆన్‌లైన్ చేసి ఏకంగా కొందరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని, అక్రమ ఆన్‌లైన్ తొలగించాలని గ్రామానికి చెందిన దేవరపల్లి సుబ్బారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూములను పరిశీలించాలని తహశీల్దార్ జనార్దన్‌ను కలెక్టర్ ఆదేశించారు. గుండ్లసముద్రం పరిధిలోని కొత్తచెరువు తరచుగా తెగిపోయి నీరు వృథాగా పోతోందని, ఎన్నోసార్లు మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్‌లు బిల్లులు చేసుకుంటున్నారే తప్పా ఉపయోగంలేదని గ్రామానికి చెందిన చంద్రమౌళి కలెక్టర్‌కు విన్నవించారు. వర్షం కురిస్తే ఇళ్ల మధ్య మోకాళ్ల లోతు వర్షపునీరు నిలబడుతుందని, అంతర్గత రహదారులు వేయాలని ఎస్టీకాలనీ వాసులు కోరారు. అంతర్గత రహదారులు, సైడ్ డ్రైన్స్ మరమ్మతులు చేయాలని, తాగునీరు, పింఛన్‌లు, పక్కా ఇళ్లు ఇప్పించాలని కోరారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, జెడ్పీ సీసీ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్, డీఎస్‌ఓ పద్మాశ్రీ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


